- ఇసుక దందా సొమ్మును బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నరని ఆరోపణ
- 100 కోట్లతో మున్సిపాలిటీల్లో తాగు నీటి సప్లయ్ పనులు చేపట్టామని వెల్లడి
- క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు
కోల్‌బెల్ట్, వెలుగు: కమీషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో మిషన్‌భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను చేపట్టారని, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కోట్లు దండుకున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. గురు, శుక్రవారాల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో మంత్రి పర్యటించారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్‌రెడ్డితో కలిసి రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఆయా చోట్ల స్థానికులు మంత్రిని సన్మానించారు. కేసీఆర్ నిరంకుశ, అహంకార పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని వివేక్ మండిపడ్డారు. మిషన్ భగీరథ పేరుతో రూ.62వేల కోట్లు దండుకున్నారుకానీ, దాంతో ఒక్క చుక్కనీరు రాలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లిస్తామని ప్రజలను మోసం చేసి కేసీఆర్ కుటుంబసభ్యులు వందల ఎకరాల ఫాం హౌస్‌లు కట్టుకున్నారన్నారు.
బీఆర్ఎస్ సర్కారు.. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మేలు కోసం అభివృద్ది పనులు చేపడుతోందన్నారు. వచ్చే నెల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఈనెల 18న మేడారంలో జరిగే కేబినెట్ మీటింగ్‌లో జీఓ 76ను పునరుద్దరించాలని సీఎంను కోరుతానని, సింగరేణి భూముల్లో ఇండ్ల జాగాలకు పట్టాలిప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇసుక దందాతో బాల్క సుమన్ వందల కోట్లు సంపాదించిండు
ఇసుక దందాతో బాల్క సుమన్ వందల కోట్లు సంపాదించుకున్నాడని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన సుమన్ చెన్నూరు అభివృద్దిని పట్టించుకోలేదని మండిపడ్డారు. నిధులు లేకపోయినా ప్రొసీడింగ్‌లు చూపించి ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. నిధులు ఉంటే అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ లీడర్లు ఇసుక, భూదందాలు చేసి కోట్లు సంపాదించారన్నారు. ఒక్కొక్క లీడర్ ఏడాదికి 50 నుంచి 60 కోట్లు దండుకున్నాడని.. లీడర్లు, కాంట్రాక్టర్లు కలసి వందల కోట్ల పన్నులు, రాయల్టీకి ఎగనామం పెట్టారని విమర్శించారు. నాడు ఇసుక దందాలో సంపాదించిన సొమ్మును ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారన్నారు.
తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరులో ఇసుక, భూదందాను బంద్ చేయించానన్నారు. దాంతో ఈసారి ఇసుక రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి 22శాతం ఆదాయం పెరిగిందన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.45 కోట్ల టీయూఐఎఫ్డీసీ, సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరిని గెలిపిస్తే ఎక్కువ నిధులు తీసుకవచ్చి మున్సిపాలిటీలను మరింత అభివృద్ది చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆరు నెలల్లో ఇంటింటికీ తాగునీళ్లు..
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా కోసం రూ.100 కోట్లతో అమృత్ స్కీం చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, మరో ఆరు నెలల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామన్నారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో రూ.250కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. మందమర్రి, మంచిర్యాలలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏటీసీలను ఏర్పాటు చేశామని, త్వరలో చెన్నూరుకు కూడా మరో కేంద్రాన్ని తీసుకువస్తామని చెప్పారు.
నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, అర్హులకు ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. చెన్నూరులో 100 బెడ్ల ఆస్పత్రిని వచ్చే మే లో ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రికి తగినంత స్టాఫ్ మంజూరుకు కృషి చేస్తున్నానని, ఇప్పటికే రూ.4కోట్ల అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు. ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్లను స్థానికులు సద్వినియోగం చేసుకుంటున్నారని, దూరప్రాంతమైన మంచిర్యాలకు వెళ్లే ఇబ్బంది తప్పిందని పేర్కొన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని శ్రీనివాస్ గార్డెన్స్ ఏరియాలో బస్‌స్టాప్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
