పల్లెప్రగతి సభలో ఎర్రబెల్లికి చుక్కెదురు

పల్లెప్రగతి సభలో  ఎర్రబెల్లికి చుక్కెదురు

గ్రామస్థుల జవాబుతో  కంగుతిన్న ఎర్రబెల్లి
రెండు వారాల్లో నీళ్లియ్యకుంటే   ఈఈ ఇంటికే అని వార్నింగ్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో బుధవారం నిర్వహించిన పల్లెప్రగతి సభలో పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు చుక్కెదురైంది. టీఆర్ఎస్​సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి సభలో ప్రసంగిస్తూ గ్రామంలో భగీరథ నీళ్లు వస్తున్నాయా అని మంత్రి అడిగారు. గ్రామస్థులు చుక్క నీళ్లు కూడా రావడం లేదని ముక్తకంఠంతో బదులివ్వడంతో దయాకర్​రావు కంగుతిన్నారు. వెంటనే ఆర్ డబ్ల్యూఎస్​ఈఈ అంజన్​రావును పిలిచి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆయన తడబడుతూ చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని జవాబు ఇచ్చారు. రెండు వారాల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఇంటికి పోతావ్ అని ఈఈకి మంత్రి వార్నింగ్ ఇచ్చారు. గ్రామంలో పల్లెప్రగతి పనులు ఎలా జరుగుతున్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు చురుకుగా సాగుతున్నాయని పంచాయతీ సెక్రటరీ కళ చెప్పారు. తాను రోడ్డు వెంట వస్తుండగా ఖాళీ స్థలాల్లో చెత్తచెదారం పేరుకుపోయి కనిపించిందని, మరి ఏం చేస్తున్నావని సెక్రటరీని మందలించారు. ఎన్నిసార్లు చెప్పినా భూయజమానులు క్లీన్​చేయట్లేదని సెక్రటరీ అన్నారు. ఖాళీ జాగల్లో చెత్త తీయకుంటే పంచాయతీ పేరిట బోర్డు పెట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మంత్రి ఆఫీసర్లను ఆదేశించారు. సర్పంచ్ రాజేశ్వరి గ్రామం నుంచి ఎలుకలపల్లికి రోడ్డు కావాలని కోరగా రూ.1.2 కోట్లు శాంక్షన్​చేస్తున్నానని, గ్రామంలో సీసీ రోడ్లకు మరో రూ.80 లక్షలు ఇస్తానని దయాకర్​రావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దివాకర్​రావు రామాలయం అభివృద్ధికి ఫండ్స్​ కావాలని కోరగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 
లీడర్ల పిల్లలను సర్కారు బళ్లకు పంపున్రి 
సర్కారు బళ్ల బలోపేతానికి ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తామని, ప్రతి ఒక్కరూ పిల్లలను సర్కారు స్కూల్​కే పంపాలని, లేకుంటే ప్రభుత్వ పథకాలు వద్దనే కట్టుబాటు పెట్టుకోవాలని మంత్రి దయాకర్​రావు అన్నారు. దీనికి సభలోని వ్యక్తి స్పందిస్తూ ముందు లీడర్ల పిల్లలను గవర్నమెంట్​స్కూళ్లకు పంపితే మిగతావాళ్లు కూడా పంపుతారని అన్నారు. పక్కనున్న లీడర్లు జోక్యం చేసుకుని అతడిని వారించారు. అంతకుముందు చెన్నూర్​ మండలం కిష్టంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు శాంక్షన్​ చేయనుందని చెప్పారు. కిష్టంపేట స్కూల్​ను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి రూ. కోటి శాంక్షన్​ చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్​రావు, కలెక్టర్​ భారతిహోళికేరి, అడిషనల్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్​ ప్రతిభాసింగ్​ తదితరులు పాల్గొన్నారు.