
హైదరాబాద్ , వెలుగు: సెక్రటేరియెట్ లోని స్టేట్ ఆర్కీవ్స్ షిఫ్టింగ్ అధికారులకు సవాల్‌గా మారనుంది. సెక్రటేరియట్‌లోని కే బ్లాక్‌లో ఉన్న ‘స్టేట్ ఆర్కీవ్స్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆర్కీవ్స్ ఇంటీరియమ్ రోపోసీటరీ’ లో ఇంకా రికార్డులను ప్యాక్ చేసే పని మొదలు కాలేదు. ఓవైపు సెక్రటేరియెట్ లోని శాఖలన్నీ బీఆర్కే భవన్ కు, ఇతర ప్లేస్ లకు షిప్ట్ అవుతుంటే ఆర్కీవ్స్ శాఖ లో ఇంతవరకు అలాంటి వాతావరణం కనపడటం లేదు. అమీర్ పేటలోని మైత్రివనానికి ఆర్కీవ్స్ శాఖను షిఫ్టు చేయాలని అధికారులు ఇదివరకే నిర్ణయించారు. అయితే ఈ శాఖను ఏ ఏజెన్సీ షిప్ట్ చేయాలనే విషయంపై క్లారిటీ లేదు. ఎలాంటి డ్యామేజ్ లేకుండా దాదాపు 20 లక్షల రికార్డులు, ఫైళ్ల తరలింపు ఎలా అని అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇతర శాఖల ఫైళ్లలా కాకుండా ఆర్కీవ్స్ కి చెందిన పురాతన రికార్డులు ప్యాకింగ్ ఎంతో జాగ్రత్తగా చేయాలని అధికారులు అంటున్నారు.
ఇప్పటికే పలు శాఖలను షిప్ట్ చేస్తున్న ప్యాకర్స్ తో ఆర్కీవ్స్ షిప్ట్ చేయకూడదని, ప్రత్యేక అనుభవం ఉన్న ప్యాకర్స్ ఏజెన్సీలయితే ఎటువంటి డ్యామేజ్ కాకుండా తరలిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 1969 నుంచి హైదరాబాద్ స్టేట్ , నిజాం స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ శాఖల జీవోలు ఇప్పటికీ ఈ భవనంలో భద్రంగా ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి రెవిన్యూ, ఆర్ధిక అంశాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు, గెజిట్లు కూడా ఉన్నాయి. వీటిలో 1665 – -67లో ఈస్ట్ ఇండియా కంపెనీ పబ్లిష్ చేసిన ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు అధికారులు
చెబుతున్నారు.
తార్నాక ఆఫీసులో ప్లేస్ లేక అమీర్ పేటకు
స్టేట్ ఆర్కీవ్స్ శాఖ ప్రధాన కార్యాలయం తార్నాకలో ఉంది. సెక్రటేరియెట్ లో ఉన్న 20 లక్షల రికార్డులను షిప్ట్ చేసేందుకు అక్కడ సరైన వసుతుల్లేవు. ఆ బిల్డింగ్ కూడా పాతదని అధికారులు చెబుతున్నారు.సెక్రటేరియట్ లోని కే బ్లాక్ లో ఉన్న ఆర్కీవ్స్ భవన విస్తీర్ణం 15 వేల చదరపు అడుగులు ఉండగా, వీటిలో 5వేల చదరపు అడుగుల్లో రికార్డులను తార్నాకలోని స్టేట్ ఆర్కీవ్స్ హెడ్డాఫీసుకి తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. మిగతావాటిని అమీర్ పేట మైత్రివనానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే షిఫ్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కొత్త బిల్డింగ్ కట్టేందుకు ప్రతిపాదన
స్టేట్ ఆర్కీవ్స్ కు సంబంధించిన ఫైళ్లు, నిజాం కాలం నాటి రికార్డులు, పత్రాలు భద్ర పరిచేందుకు నూతన భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. 80వేల చదరపు అడుగుల భవనం అవసరమవుతుందని, దీనికి రూ.15 కోట్లు ఖర్చవుతుందని, రికార్డులు భద్రపరిచేందుకు ఇంటీరియర్ మరమ్మతులు, ఫర్నిచర్ , ర్యాక్ ల కొనుగోలుకు మరో రూ.5 కోట్లు అవసరమవుతాయని ఆర్కీవ్స్ అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆర్ అండ్ బీ అధికారులను సంప్రదిస్తాం
ఆర్కీవ్స్ షిప్టింగ్ పై త్వరలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం కావాల్సి ఉంది. మిగతా శాఖలు చేసిన విధంగా ఆర్కీవ్స్ ను షిప్టింగ్ చేయలేం. అమీర్ పేటలోని మైత్రివనానికి షిప్ట్ చేయాలి. పాత రికార్డులు, జీవోలు ఉన్న కారణంగా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. ఇంకా సర్దే పక్రియ స్టార్ట్ చేయలేదు. దీనికే నెల పడుతుంది. ప్యాకర్స్ కూడా అనుభవం ఉన్నవాళ్లు ఉండాలి. త్వరలో అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది.
- ఆకునూరి మురళి, ఆర్కీవ్స్ డైరెక్టర్