సిటీలో టీఎస్ బీపాస్ రూల్స్ బేఖాతర్

సిటీలో టీఎస్ బీపాస్ రూల్స్ బేఖాతర్
  • నిబంధనలకు విరుద్ధంగా వందల నిర్మాణాలు
  • బిల్డర్ల ఇష్టారాజ్యంతో పెరుగుతున్న ఇల్లీగల్ కన్​స్ట్రక్షన్స్

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ సిటీలో బిల్డర్లు టీఎస్ బీపాస్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. కొంతమంది పర్మిషన్​ లేకుండానే ఇండ్లు కడుతుండగా చేస్తుండగా.. ఇంకొంతమంది ఒక ఇంటికి పర్మిషన్​తీసుకుని అంతకుమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అందులోనూ డ్రైన్లు, రోడ్లను ఆక్రమించడమే కాక కనీస సెట్ బ్యాక్​ లేకుండానే కట్టి, అమ్మేస్తున్నారు. కొంతమంది ఆఫీసర్లు కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతుండటంతో బిల్డర్లు టీఎస్​ బీపాస్​ చట్టాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు.

పర్మిషన్ ఒకలా.. కన్ స్ట్రక్షన్ ఇంకోలా..

భవన నిర్మాణ పర్మిషన్లను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2020లో టీఎస్​బీపాస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇండ్లు కట్టుకునేవాళ్లు బిల్డింగ్​ ప్లాన్​ తో ఆన్​ లైన్​ ద్వారా అప్లికేషన్​ పెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం గ్రేటర్​ కు చెందిన వివిధ వింగ్ ల అధికారులు ఫీల్డ్​ విజిట్​ చేసి అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లోగా పర్మిషన్​ ఇవ్వాలి.  ముందుగా వెబ్ సైట్​ లో పొందుపరిచిన ప్లాన్ ప్రకారమే బిల్డింగులు కట్టాల్సి ఉండగా.. వరంగల్ సిటీలో కొందరు బిల్డర్లు టీఎస్​బీపాస్​ రూల్స్ అన్నీ తుంగలో తొక్కి కన్​ స్ట్రక్షన్స్​ చేపడుతున్నారు. పర్మిషన్​ ఒకలా తీసుకుని.. కన్​ స్ట్రక్షన్​ ఇంకోలా చేస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఏటా సగటున 4 వేల వరకు ఇండ్లు కన్​ స్ట్రక్షన్​ అవుతుండగా.. అందులో ఎలాంటి డీవియేషన్​ లేని ఇండ్లు పదుల సంఖ్యలో మాత్రమే ఉంటాయని ఆఫీసర్లే చెబుతుండటం గమనార్హం. కాగా చాలామంది ఒక ఇంటికి పర్మిషన్ తీసుకుని రెండు ఇండ్లు లేదా  ప్లస్​ టూ, ప్లస్ త్రీ ఫ్లోర్లకు కడుతున్నారు.  సెల్లార్​కు పర్మిషన్​ ఇవ్వకున్నా తాము అనుకున్న ప్లాన్​ ప్రకారం కట్టుకుపోతున్నారు. ప్రధానంగా ఖిలావరంగల్, రంగశాయిపేట, మామునూరు, మడికొండ, కాజీపేట, గోపాలపూర్​, చింతగట్టు, హసన్​పర్తి, ఎర్రగట్టుగుట్ట తదితర ప్రాంతాల్లో రూల్స్​ డీవియేట్​ చేసి ఇండ్లు కడుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖాలు, ఇతర నిషేధ ప్రాంతాల్లో కన్​ స్ట్రక్షన్​ చేసి అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.

తెరవెనుక ఆఫీసర్లు..

అరకొర పర్మిషన్లతో బిల్డింగులు కడుతున్న పలువురు ఆఫీసర్లను నయానో భయానో దారిలోకి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఎంతోకొంత ముట్టిన తరువాత ఆఫీసర్లే తెరవెనుక ఉండి అన్నీ నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మడికొండ కెనరా బ్యాంక్​ సమీపంలో ఓ బిల్డర్​ ఒక ఇంటికి పర్మిషన్​ తీసుకుని రెండు బిల్డింగులు లేపి.. ఎలాంటి సెట్​ బ్యాక్​ లేకుండా కన్​ స్ట్రక్షన్​ పూర్తి చేశాడు. ఇందుకు ఓ అధికారికి భారీ గానే ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇక్కడ రూల్స్​పాటించకపోవడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా..  ఆ బిల్డింగ్​కు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయినా సదరు బిల్డర్​ గుట్టుగా వర్క్స్​ కంప్లీట్​ చేస్తుండగా.. అసలు ఈ డీవియేషన్​ గురించి తమకు సమాచారమే లేదని ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. ఇదే ఏరియాలో జరుగుతున్న ఇంకో ఐదారు బిల్డింగులదీ ఇదే పరిస్థితి. అంబేడ్కర్​ భవన్ సమీపంలోని విద్యానగర్​ లో ఓ బిల్డర్​టౌన్ ప్లానింగ్​లోని ఓ ఆఫీసర్​ సహాయంతో సరైన పర్మిషన్​ లేకుండా సెల్లార్​ వేసి బిల్డింగ్​లేపుతున్నాడు. ఇలాగే గోపాలపూర్​ చెరువుకు ఆనుకుని కూడా ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ఖిలావరంగల్, మామునూరు, రంగశాయిపేటతో పాటు కోమటిపల్లి, గోపాలపూర్​ మధ్యలో పర్మిషన్​ లేకుండానే బిల్డర్లు ఇండ్లు కట్టి అమ్ముతుండగా.. ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై కూడా ఆరోపణలున్నాయి.

అతిక్రమించినా.. నో యాక్షన్...

టీఎస్​బీపాస్​ రూల్స్​ డీవియేట్​ చేస్తే అక్కడి పరిస్థితులను బట్టి ఆ నిర్మాణాన్ని తొలగించడమో.. పెద్ద మొత్తంలో ఫైన్​ వేయడమో చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి ఆఫీసర్లు ప్రలోభాలకు లోబడి ఆ దిశగా చర్యలు తీసుకోవడమే మానేశారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి జిల్లా స్థాయిలో టాస్క్​ ఫోర్స్​ కమిటీ ఉన్నా.. వరదలు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఇకనైనా నగరంలో అక్రమ కట్టడాలను అరికట్టడానికి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని, టీఎస్​ బీపాస్​ చట్టాన్ని నీరుగార్చకుండా పకడ్బందీ యాక్షన్ తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. 

మా దృష్టికి రాలేదు

టీఎస్​ బీపాస్​ రూల్స్​ ప్రకారం సరైన పర్మిషన్​ లేని ఇండ్లకు నోటీసులు ఇస్తాం. రూల్స్​ డీవియేట్​ చేస్తే తప్పకుండా యాక్షన్​ తీసుకుంటాం. మడికొండలో ఇల్లీగల్​ కన్​ స్ట్రక్షన్స్​ విషయం మా దృష్టికి రాలేదు. వాటిని పరిశీలించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాస్​, అసిస్టెంట్​ సిటీ ప్లానర్​, జీడబ్ల్యూఎంసీ