ఆర్బిట్రేషన్‌‌ సెంటర్‌‌ భూములపై సర్కారుకు నోటీసులు

ఆర్బిట్రేషన్‌‌ సెంటర్‌‌ భూములపై సర్కారుకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు :  ఇంటర్నేషనల్‌‌ ఆర్బిట్రేషన్‌‌ అండ్‌‌ మీడియేషన్‌‌ సెంటర్‌‌(ఐఏఎంసీ)కు భూకేటాయింపుల కేసులో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించిన జస్టిస్‌‌ లక్ష్మణ్, జస్టిస్‌‌ సుజనతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌  విచారణను డిసెంబరు 21కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌‌ గ్రామ సర్వే నెం. 83/1లో 3.30 ఎకరాలను ఐఏఎంసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో జీవో  ఇచ్చింది. 

దాని నిర్వాహణకు ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా కూడా 78, 385 నంబర్లతో జీవోలను జారీ చేసింది. వీటిని వ్యక్తిగత హోదాలో లాయర్‌‌ కోటి రఘునాథరావు సవాల్‌‌ చేస్తూ పిల్‌‌ దాఖలు చేశారు. రూ.300 కోట్ల విలువైన భూమితోపాటు ఐఎఎంసీ నిర్వtహణ కోసం ఏటా రూ. 3కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఇస్తూ జారీ చేసిన జీవోల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.  

ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం వాపస్‌‌ తీసుకునేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలన్నారు. పక్షపాత ధోరణితో జీవోలు ఇవ్వడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, ఐఏఎంసీ సీఈవోలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.