కల్లు దుకాణాలకు అనుమతిపై ప్రభుత్వానికి నోటీసులు

కల్లు దుకాణాలకు అనుమతిపై ప్రభుత్వానికి నోటీసులు

 హైదరాబాద్, వెలుగు:  తాటి చెట్లు లేని హైదరాబాద్‌‌‌‌ వంటి పట్టణ ప్రాంతాల్లో  కల్లు దుకాణాల ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌‌‌‌ తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో 50 కిలో మీటర్ల పరిధి వరకు తాటిచెట్లు అందుబాటులో లేకపోయినా..అక్కడ  కల్లు దుకాణాలకు అనుమతిస్తూ ఇచ్చిన జీవో 24ను ఫోరం ఫర్‌‌‌‌ గుడ్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌ హైకోర్టులో సవాల్‌‌‌‌ చేసింది. దీనిని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే,  జస్టిస్‌‌‌‌ జె.అనిల్‌‌‌‌ కుమార్ తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ శుక్రవారం విచారించింది.

కల్తీ కల్లుతో ప్రజలు చనిపోతున్నారని, తాటి చెట్లు లేకపోయినా కల్లు దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని అడ్డుకోవాలని పిటిషనర్‌‌‌‌ లాయర్‌‌‌‌ కోరారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం  తాటి వనాలు లేని ప్రాంతాల్లో కల్లు దుకాణాలను మూసేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌‌‌‌ ఏరియాలో మళ్లీ 100 కల్లు దుకాణాలకు అనుమతించిందన్నారు. ఆ జీవోను కొట్టివేయాలని కోరారు. వాదనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసి, విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.