కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలే?

కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలే?
  • కోర్టు ధిక్కరణ కేసులో నవీన్ మిట్టల్​కు  నోటీసులు
  • నల్గొండ కలెక్టర్  వినయ్ కృష్ణారెడ్డి, తహసీల్దార్​కు కూడా..
  • విచారణ వచ్చే నెల 3కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి (సీసీఎల్‌ఏ) నవీన్‌  మిట్టల్, నల్గొండ జిల్లా కలెక్టర్‌  వినయ్‌ కృష్ణారెడ్డి, అంతకుముందున్న కలెక్టర్‌  రాహుల్‌ శర్మ, నిడమనూరు తహసీల్దార్‌  హెచ్‌.ప్రమీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌  దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడుం గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ భూములు పొందిన వాళ్ల నుంచి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పిటిషన్​ దాఖలైంది. 

ఈ  పిటిషన్‌ను  చీఫ్‌  జస్టిస్‌  ఉజ్జల్‌  భూయాన్, జస్టిస్‌ ఎస్‌.నందతో కూడిన డివిజన్‌  బెంచ్‌  మంగళవారం విచారించింది. కాగా, అసైన్​మెంట్​కమిటీ ఆమోదం, సిఫార్సు లేకుండానే అనర్హులు ఆరుగురు ప్రభుత్వ భూమి పదెకరాలు పొందారని పేర్కొంటూ వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. భూమి పొందినవారిలో ఒక్కరే అర్హులని, మిగిలిన వాళ్ల నుంచి భూమి వాపసు తీసుకుంటామని, ఇందుకు బాధ్యులైన తహసీల్దార్, వీఆర్‌ఓపై చర్యలు తీసుకుంటామని గతంలో హైకోర్టుకు ఉన్నతాధికారులు రిపోర్టు ఇచ్చారు. కానీ వారిపై చర్యలు తీసుకోలేదు. ఆ ఉత్తర్వులు అమలు కాలేదని పిటిషనర్‌  కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయగా విచారించిన బెంచ్‌..  అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విచారణను ఆగస్ట్‌ 3కి వాయిదా వేసింది.