తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం
  • ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఆన్‌‌లైన్‌‌లోనూ దరఖాస్తుకు చాన్స్.. కానీ మాన్యువల్‌‌గా అందజేయాలి
  • 13న పరిశీలన..
  • 15వ తేదీ దాకా విత్‌‌డ్రాకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. గవర్నర్ తమిళిసై ఆమోదంతో గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ను జారీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయమై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 10 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఈనెల13న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ విత్‌‌డ్రాకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈనెల 30న పొలింగ్‌‌ , డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

రెండు నియోజకవర్గాల్లోనే పోటీ

ఈసీ నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ల దాఖలు సమయంలో ఆర్​వో, ఏఆర్​వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలనే అనుమతిస్తారు. నామినేషన్‌‌, అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ పత్రాలన్నీ రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచాలి. అభ్యర్థుల అఫిడవిట్‌‌ను 24 గంటల్లోపు వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్‌‌లో ఏవైనా ఖాళీలుంటే ఆర్​వో సదరు అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే దాన్ని వెబ్‌‌సైట్‌‌లో పొందుపర్చాలి. నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. ఈసారి అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌‌లైన్‌‌లోనూ అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆన్‌‌లైన్‌‌లో నామినేషన్ సమర్పించినప్పటికీ.. ఆ అభ్యర్థి అప్లై చేసిన డాక్యుమెంట్​ను ప్రింట్ తీసుకుని, దానిపై సిగ్నేచర్ చేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు.. విదేశాల నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. తర్వాత వాటిని పంపుతారు.ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న 60 మంది ఐఆర్ఎస్‌‌, ఐఆర్‌‌‌‌ఎస్‌‌ఏలను పరిశీలకులుగా ఈసీ ఇప్పటికే నియమించగా.. వారు శుక్రవారం నుంచి విధుల్లో ఉంటారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై నిఘా పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో లెక్కిస్తారు.

పూర్తి కాని అభ్యర్థుల ప్రకటనలు

ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచే మొదలవుతుండగా.. ఇంకా అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ గోషామహల్, నాంపల్లి సీట్లను ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా వంద సీట్లకే అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఇంకో 19 నియోజకవర్గాలపై కసరత్తు కొనసాగుతున్నది. బీజేపీ 88 మందిని, బీఎస్పీ 63 మందిని ప్రకటించాయి.