ఓడినోళ్లకు చాన్స్ లేనట్టే!

ఓడినోళ్లకు చాన్స్ లేనట్టే!
  • ఏఐసీసీ నిర్ణయంతో చుక్కెదురు
  • ఎమ్మెల్సీ టికెట్ రేసులో సీనియర్లు
  • ఒకటి కోదండరాంకు లేదా సీపీఐకి?
  • క్యూలో సీఎం అనుచరులు కూడా
  • టికెట్ త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం దక్కేనా?

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కొందరు సీనియర్ నేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఏఐసీసీ నిర్ణయం మేరకు ఎన్నికల్లో ఓడిన నాయకులకు ఏడాది వరకు కొత్త పదవులకు అవకాశం ఇవ్వొద్దు. ఈ  నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు సీనియర్లకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చే అవకాశం లేదు. ఇలా అవకాశం కోల్పోతున్న వారిలో ముగ్గురు మైనార్టీ నేతలు కూడా ఉండటం గమనార్హం.

నిజామాబాద్ అర్బన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ లకు అవకాశం దక్కకపోవచ్చునని తెలుస్తోంది. వీరితో పాటు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డిలకూ చాన్స్ ఉండదని తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఈ అంశాలను ప్రస్తావిస్తారని సమాచారం. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేసిన సీనియర్ నేత చిన్నారెడ్డి,

పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, నిజామాబాద్ అర్బన్ నుంచి హైకమాండ్ సూచనతో తప్పుకున్న మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్​ జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా ఈ సారి మండలి బరిలో ఉన్నారని సమాచారం. వీరిలో ఎవరికి అవకాశం లభిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

మైనార్టీలకు ఒకరికి ఇస్తామన్న హామీ నేపథ్యంలో అలీ మస్కతీ, జాఫర్ జావిద్ తమ వంతు  ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బీసీ నాయకుడిగా పేరున్న ఈరవత్రి అనిల్ కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితులుగా పేరున్న వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాలరావు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఒక సీటుపై సీపీఐ, జనసమితి గురి

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ  నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీ మీరే ఒక సీటు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఇదిలా ఉండగా పూర్తిగా పోటీ నుంచే తప్పుకొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఇటీవలే సీఎం రేవంత్ వెల్లడించారు.

తొలుత ఆయనను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా ఆయన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే వినియోగించుకోవాలనుకుంటున్నదని తెలుస్తోంది. అయితే గవర్నర్ కోటాలో పంపుతారని ప్రచారం జరుగుతున్నా.. ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఎమ్మెల్యే కోటాయే బెటర్ అనే ధోరణి జనసమితి నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. 

సీఎం ఢిల్లీ టూర్ అందుకేనా

ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపు నేపథ్యంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎవరికి టికెట్లు ఇవ్వాలన్న అంశంపై అధిష్టానంతో సీఎం చర్చించనున్నట్టు తెలుస్తోంది. పలు కీలక కార్పొరేషన్ పదవులపైనా సీఎం హైకమాండ్ తో మాట్లాడుతారని సమాచారం. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాక ఎమ్మెల్సీ అభ్యర్థులెవరన్నది తేలనుంది. 

పోటీ చేసి ఓడిపోయిన నేతలు

మధుయాష్కీ    ఎల్బీనగర్
షబ్బీర్ అలీ    నిజామాబాద్ అర్బన్
ఫిరోజ్ ఖాన్     నాంపల్లి
సంపత్ కుమార్     అలంపూర్
అంజన్  యాదవ్    ముషీరాబాద్
జగ్గారెడ్డి        సంగారెడ్డి
రోహిన్ రెడ్డి        అంబర్ పేట్
అజారుద్దీన్        జూబ్లీ హిల్స్

టికెట్ త్యాగం చేసిన వాళ్లు

చిన్నారెడ్డి        వనపర్తి
అద్దంకి దయాకర్    తుంగతుర్తి
మహేశ్ కుమార్ గౌడ్    నిజామాబాద్ అర్బన్

సీనియర్లు

జానారెడ్డి        మాజీ మంత్రి
బలరాం నాయక్    మాజీ ఎంపీ
నిరంజన్        పీసీసీ ఉపాధ్యక్షుడు
కుమార్ రావు    పీసీసీ ఉపాధ్యక్షుడు 

మైనార్టీ కోటాలో అలీ మస్కతీ, జాఫర్ జావీద్

సీఎం సన్నిహితులుగా పేరున్న వాళ్లు: వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాలరావు