ఎన్నికలకుఈసీ రెడీ..  అక్టోబర్ లేదా నవంబర్​లో నోటిఫికేషన్

ఎన్నికలకుఈసీ రెడీ..  అక్టోబర్ లేదా నవంబర్​లో నోటిఫికేషన్

 

  • ఏర్పాట్లు స్పీడప్ చేసిన ఎలక్షన్ కమిషన్
  • జులై 5 నుంచి 10 దాకా ఆఫీసర్లకు మాస్టర్ ట్రైనింగ్
  • ఇప్పటికే 73 వేల ఈవీఎంలు సిద్ధం 
  • అధికారుల బదిలీలకు ఇటీవల ఆదేశం
  • ఎలక్షన్ మూడ్​లోకి అన్ని పార్టీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) రెడీ అయింది. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ కు ఇటీవల ఆదేశాలిచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల నిర్వహణపై ఈ నెల 5 నుంచి 10 వరకు 60 మంది ఆఫీసర్లకు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లో మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసింది.


ఈసీ నుంచి వస్తున్న ఎక్స్​పర్ట్స్ ఓటర్ల నమోదు దగ్గరి నుంచి నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, ప్రచారం, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తారని ఈసీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎన్నికల ప్రాసెస్​పై ఆఫీసర్లకు ఇప్పటికే రెండుసార్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఒకసారి జిల్లా కలెక్టర్లు కూడా అటెండ్ అయ్యారు. ఇక సోమవారం నుంచి శనివారం దాకా మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ట్రైనింగ్​లు పూర్తయితే గ్రౌండ్​ లెవెల్​లో ఎన్నికల ప్రాసెస్​కు పెద్దగా ఇబ్బందులు ఉండవని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఈవీఎంల ఎఫ్ఎల్​సీ పూర్తి..  

ప్రస్తుత అసెంబ్లీకి గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఆలోపు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో పోయినేడాది మాదిరిగానే ఈసారి కూడా డిసెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తున్నదని తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్​ చివరలో లేదంటే నవంబర్​లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగా ఎలక్షన్​కు అవసరమైన ఈవీఎంలను సిద్ధం చేసుకోవడంతో పాటు ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలను ఈసీ చేపడుతున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి కొత్త ఈవీఎంలను వాడుతున్నారు. ఇందుకోసం ఈసీఐఎల్ నుంచి ఇప్పటికే 73,210 ఈవీఎంలు తీసుకొచ్చారు. వీటికి ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్ఎల్​సీ) కూడా దాదాపు పూర్తయింది. ఈ కొత్త మెషీన్లు ఎం-3 మోడల్‌‌కు చెందినవని ఈసీ ఆఫీసర్లు చెబుతున్నారు. వీటితో పెద్దగా సాంకేతిక సమస్యలు ఉండవని, ఎక్కువ సంఖ్యలో క్యాండిడేట్లు పోటీ చేసినా ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు.

3 కోట్ల మంది ఓటర్లు..
.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాను ఈ ఏడాది జనవరిలోనే ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఓటర్ల జాబితా సవరణను ఈసీ చేపట్టింది. అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండేవారు ఎవరైనా ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్లను జూన్​ 23 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్నది. జూన్ 24 నుంచి జులై 27 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, సిమిలర్ ఎంట్రీల తొలగింపు తదితర పనులు పూర్తి చేయనుంది. అనంతరం ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తుంది. దీనిపై ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించింది. ఏమైనా సమస్యలు, లోపాలు తలెత్తితే వాటి పరిష్కారానికి సెప్టెంబర్​ 2 వరకు గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 4న రాష్ట్ర ఓటర్ల తుది జాబితా ఇస్తుంది. కాగా, కొత్త ఓటర్లు యాడ్ అయితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆఫీసర్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేల పైరవీలు.. 

అధికారుల బదిలీలకు ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైరవీలు మొదలుపెట్టారు. జిల్లా, నియోజకవర్గాల పరిధిలో తమకు అనుకూలమైన అధికారులను పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాము చెప్పినట్లు నడుచుకునే ఆఫీసర్లు లిస్టు తీస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఎస్సైలు.. ఇలా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే ఆఫీసర్లందరూ తమ వాళ్లే ఉండేలా చూసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్​ఫర్ ఆర్డర్లు రాకముందే.. తమ అనుకునోళ్ల పేర్లను ప్రతిపాదించి వారినే తమ జిల్లా, నియోజకవర్గాలకు పంపించాలని సర్కార్ పెద్దలను కోరుతున్నారు. సీఎంవోతో పాటు ఉన్నతాధికారుల దగ్గర ఎవరెవరు ఏ ప్రాంతంలో కావాలో చెబుతూ ప్రపోజల్స్ పెడుతున్నారు.

సిద్ధమవుతున్న పార్టీలు

రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేశాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జనాల్లోకి వెళ్లింది. గతంలో ప్రకటించి వదిలేసిన పథకాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. వాటిని ఈ నెల, వచ్చే నెలలో ప్రారంభించి కొంత వరకు పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు  నిర్వహిస్తున్నది. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. నియోజకవర్గాల్లోనే అందుబాటులో ఉండాలని, పర్యటనలు పెంచాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అధికార పార్టీ వ్యూహాలకు అనుగుణంగా ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ​బీసీ డిక్లరేషన్​ప్రకటించగా, బీజేపీ ఎన్నికల దిశగా యాక్షన్ ప్లాన్​ను సిద్ధం చేసుకుంటున్నది.