డాక్టర్ పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్

డాక్టర్ పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
  • టెంపరరీ ఉద్యోగులకు 20 శాతం వెయిటేజీ
  • ఆరోగ్యశాఖలో దశలవారీగా 10 వేల పోస్టుల భర్తీకి చర్యలు
  • అధికారులతో రివ్యూలో మంత్రి హరీశ్​రావు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 1,326 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించారు. కరోనా కాలంలో వైద్య సేవలు అందించిన కాంట్రాక్ట్ డాక్టర్లకు 20 శాతం వెయిటేజీ ఇస్తామని చెప్పారు. ఎంబీబీఎస్‌‌లో సాధించిన మార్కులను మిగిలిన 80 శాతానికి లెక్కిస్తారని తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు ఆఫీసర్లతో మంత్రి సోమవారం రివ్యూ చేశారు. 
డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దుకు ఉత్తర్వులు
డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌‌ రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసి, 1326 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్ ఆఫీసర్లకు సూచించారు. ఆరోగ్యశాఖలో మొత్తం 12,755 ఖాళీలు ఉన్నాయని, అందులో 10,028 పోస్టులను రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాబోయే 3, 4 వారాల్లో బోర్డు నుంచి దశలవారీగా అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతాయన్నారు. కొన్ని టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్‌‌, జూనియర్ అసిస్టెంట్ పోస్టులే టీఎస్‌‌పీఎస్సీ ద్వారా భర్తీ అవుతాయని, నిమ్స్‌‌లో ఖాళీలు నిమ్స్ బోర్డు రిక్రూట్‌‌ చేస్తుందని, మిగిలిన అన్ని పోస్టులనూ మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు. 
ఆయుష్​ పోస్టులను కూడా బోర్డు ద్వారానే భర్తీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో 34, 35లో మార్పులు చేస్తామని చెప్పారు. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఇందులో కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ నర్సులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని ప్రకటించారు. ఆయుష్ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌ను టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌గా మార్చే ప్రక్రియను త్వరగా  పూర్తి చేసి, అందులో ఏర్పడే ఖాళీలను వచ్చే నోటిఫికేషన్  ద్వారా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్‌‌‌‌‌‌‌‌లోనూ సవరణ చేయాలని, వాళ్లకు కూడా ప్రైవేటు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని ఆదేశించారు.
ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం ఉద్యోగుల జాబితా కావాలె
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా రూపొందించాలని ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం డైరెక్టర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతిని మంత్రి ఆదేశించారు. ఏయే విభాగాల్లో ఎంత మంది ఉన్నారు? ఏయే పనులు చేస్తున్నారనే పూర్తి వివరాలతో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉండాలని సూచించారు. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు స్టైపండ్  రూపంలో ఏడాదికి రూ.330 కోట్లు వెచ్చిస్తున్నామని, వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు విధాన రూపకల్పన చేయాలని డీఎంఈకి సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ శివశంకర్, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, డీహెచ్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌‌‌‌‌‌‌‌కుమార్, మెడికల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గోపికాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.