- ఫెడరర్ రికార్డు సమం
మెల్‌బోర్న్: సెర్బియా సూపర్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్.. టెన్నిస్ హిస్టరీలో మరో రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ జొకో 6–0, 6–0, 6–3తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్స్‌లో కలిపి 58వ సారి క్వార్టర్స్ చేరిన రోజర్ ఫెడరర్ రికార్డును సమం చేశాడు. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనే క్వార్టర్‌ఫైనల్ చేరుకోవడం జొకోకు ఇది 14వ సారి.
ఆల్‌టైమ్ లిస్ట్‌లో రఫెల్ నడాల్, జాన్ న్యూకాంబ్‌తో సమంగా రెండో ప్లేస్‌లో నిలిచాడు. అయితే వీరిలో ఎక్కువగాసార్లు టైటిల్స్ నెగ్గింది మాత్రం జొకోనే. ఇక మనారినోతో గంటా 44 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌ను జొకో తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఏకపక్షంగా మార్చేశాడు. 31 విన్నర్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. తొలి రెండు సెట్లలో మనారినో ఒక్కసారి కూడా సర్వీస్‌ను నిలబెట్టుకోలేదు. అయితే థర్డ్ సెట్‌లో మూడుసార్లు సర్వీస్‌ను కాపాడుకోవడంతో ‘ట్రిపుల్ బాగెల్ (6–0, 6–0, 6–0)’ కాకుండా అడ్డుకున్నాడు. ఓపెన్ ఎరాలో ఐదు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు మాత్రమే ట్రిపుల్ బాగెల్ అయ్యాయి. మరో మ్యాచ్‌లో సినర్ (ఇటలీ) 6–4,7–5,6–3తో కచనోవ్ (రష్యా)పై, ఆండ్రీ రబ్లెవ్ (రష్యా) 6–4, 6–7 (5/7), 6–7(4/7), 6–3, 6–0తో డి మినార్ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. అయితే గ్రీస్ స్టార్ సిట్సిపాస్ 6–7 (3/7), 7–5, 3–6, 3–6తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓడి ఇంటిముఖం పట్టాడు.
సబలెంక ఈజీగా..
విమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక (బెలారస్) ఈజీగా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో 6–3, 6–2తో అమండా అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌లో నాలుగోసీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో మగ్దలెనా ఫ్రిచ్ (పోలెండ్)పై, బార్బరా క్రెజికోవా (చెక్) 4–6, 6–3, 6–2తో మిర్రా ఆండ్రీవా (రష్యా)పై, మార్టా కోస్తుక్ ((ఉక్రెయిన్) 6–2, 6–1తో తిమోఫివా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.
