పట్టుదలతో స్టేట్​ ఫస్ట్​ వచ్చింది

పట్టుదలతో స్టేట్​ ఫస్ట్​ వచ్చింది

పెద్ద చదువులు చదవాలన్న ఆమె కలకి పెండ్లితో  బ్రేక్​ పడింది.  పిల్లలు, ఇంటి బాధ్యతలతో తీరిక ఉండేది కాదు. అయితే, పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, ఖాళీ టైమ్​లో మళ్లీ పుస్తకాలు అందుకుంది. భర్త ఎంకరేజ్​మెంట్​తో డిగ్రీ, పీజీతో పాటు బీఎడ్​ కూడా చదివింది. ఆ తర్వాత అంగన్​వాడి టీచర్​ జాబ్​కి ఎంపికైంది. ఇప్పుడు సూపర్​వైజర్​ గ్రేడ్​-2 పరీక్షల్లో  స్టేట్​ ఫస్ట్​ ర్యాంక్​ తెచ్చుకుంది. గట్టిగా ప్రయత్నిస్తే, అనుకున్నది సాధించొచ్చని నిరూపించింది మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన వేముల శ్రీలత. 

మందమర్రిలోని గాంధీనగర్​లో ఉంటుంది  శ్రీలత ఫ్యామిలీ. ఆమె భర్త కృష్ణ  కోర్టు ఉద్యోగి. వీళ్లకు  ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు బీటెక్, ​మరొకరు ఇంటర్​ చదువుతున్నారు. భర్త ఎంకరేజ్​మెంట్​తో పెండ్లితో ఆగిపోయిన చదువుని మళ్లీ కంటిన్యూ చేసింది శ్రీలత. 2005లో అంగన్​వాడీ టీచర్​ పోస్టుకి సెలక్ట్​ అయింది.  దాదాపు 17 ఏండ్లు తమ కాలనీలోని అంగన్​వాడీలో  టీచర్​గా పని​ చేసింది. అయితే, అదే డిపార్ట్​మెంట్​లో పెద్ద జాబ్​ చేయాలని ఉండేది ఆమెకు. సూపర్​వైజర్​ గ్రేడ్​-2 ఎగ్జామ్​కి బాగా ప్రిపేర్​ అయింది. ఫ్యామిలీ సపోర్ట్​​ కూడా లభించడంతో ఆ ఎగ్జామ్​లో స్టేట్​ ఫస్ట్​ ర్యాంక్​ తెచ్చుకుంది.  

పెద్ద జాబ్​ టార్గెట్ 

అంగన్​వాడీ టీచర్​గా చేస్తూనే, పెద్ద జాబ్స్​కి ప్రిపేర్​ అయ్యేదాన్ని. 2012లో సీడీపీవో (చైల్డ్ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్​ ఆఫీసర్​) సూపర్​ వైజర్​ గ్రేడ్​-1కు సెలెక్ట్​  అయ్యా.  అయితే, అర్హతకు మించి చదువుకున్నానని ఆ పోస్ట్ నాకు ఇవ్వలేదు.  మూడు నెలల కిందట  అంగన్​వాడి సూపర్​వైజర్​ గ్రేడ్​2 పోస్టు​ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటి దగ్గరే ఎగ్జామ్​కి ప్రిపేర్​ అయ్యా.  అయితే, స్టేట్​ ఫస్ట్​ వస్తానని మాత్రం అనుకోలేదు. పెద్ద జాబ్​ చేయాలనే కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది.
::: మందమర్రి, వెలుగు