అందరితో కలిసిపోతనే ఆరోగ్యం..

అందరితో కలిసిపోతనే ఆరోగ్యం..

ఎదుటివాళ్లు చెప్పేది వినకుండా దిక్కులు చూస్తుంటారు కొందరు. మాటలతోనే డామినేట్ చేసి, ‘మాదే కరెక్టు’ అంటారు మరికొందరు. చిన్న చిన్న వాటికే కోపగించుకుంటారు ఇంకొందరు. ఒక్కో మనిషిది ఒక్కో తరహా. కానీ అందరితో కలిసి ఉండాలంటే కొన్ని దూరం చేసుకోవాలి. నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. ఎదుటి వాళ్ల స్వభావం, సందర్భం, అవసరం..లాంటి వాటిని చూసుకుని మారాలి. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని కూర్చోకూడదు. తోటి మనుషులతో కలివిడిగా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు.

వినడం నేర్చుకోవాలి

ప్రపంచంలో సగం సమస్యలు ఎదుటి వాళ్లు చెప్పేది వినకపోవడం వల్ల, విన్నా సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే వస్తాయి. వినడం అద్భుతమైన కళ. ఇంట్లో తల్లిదండ్రులు, చదువుకునేటప్పుడు టీచర్లు, స్నేహితులు, పెద్దవాళ్లు..ఎవరు చెప్పి నా వినాలి. ఎక్కు వమంది తాము చెప్పేది ఎదుటి వాళ్లు వినాలని కోరుకుంటారు. అందుకే మరొకరు మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డు చెప్పకూడదు. ‘వాళ్లకేం తెలుస’నే గర్వం పనికిరాదు. శ్రద్ధగా వినడం వల్ల ఎదుటి వాళ్ల అభిమానాన్ని పొందొచ్చు.

సంతోషానికి ఓర్పు

ఓర్పు లేని వాళ్లు ఏ స్థాయికి ఎదిగినా, ఎప్పుడో ఒకప్పుడు కింద పడిపోతారు. చిన్నచిన్న మాట పట్టింపులతో ఓర్పు లేక గొడవలు పెట్టుకునే వాళ్లూ ఉన్నారు. అదే ఓర్పుతో ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారొచ్చు. కోపం వచ్చినప్పుడు ఓర్పుతో ఉండటం నిజానికి కష్టమైన పనే. ఓ మాట అంటే ‘అంటే అన్నాడులే’, ఓ తప్పు చేస్తే ‘ చేస్తే చేశాడులే’ అని ఓర్పుతో, క్షమిం చే గుణం ఉండాలి. ఓర్పు వల్ల మనుషులు దూరం కారు. సంతోషంగా ఉంటారు.

మనసారా మెచ్చుకోవాలి

ప్రతి ఒక్కరూ గుర్తిం పు కోరుకుంటారు. చిన్న పొగడ్తకు కూడా చాలా సంతోషిస్తారు. అందువల్ల స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు…ఎవరైనా సరే చిన్న మంచిపని చేసినా మెచ్చుకోవాలి. మాటలతో చెప్పకపోయినా, కలిసి అభినందించకపోయినా.. ‘కంగ్రాట్స్‌‌‌‌’ అని వాట్సాప్‌ , ఫేస్‌ బుక్‌ , ట్విట్టర్‌ లో అయినా ఒక్క మెసేజ్‌ పెడితే చాలు. ఎంతో సంతోషిస్తారు. గుర్తు పెట్టుకుంటారు. అయితే మెచ్చుకోవడం అనేది మనఃస్ఫూర్తిగా జరగాలి.

చిరునవ్వుతో గెలవచ్చు

సంతోషంగా బతకడమే జీవితానికి అసలు సూత్రం. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా కూర్చుంటే, ఎవరూ దగ్గరకు రారు. పలకరించరు. అందుకే, ఉన్నదాన్లోనే సంతోషంగా బతకాలి. అలా బతికినప్పుడే మీతో ఉన్నవాళ్లూ సంతోషంగా ఉంటారు. సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోవచ్చు. ముఖం మీద చిరునవ్వు ముఖానికే కాదు, మనసుకూ మంచిదే. సంతోషంగా బతకడమే అసలైన ఆరోగ్యం .

నలుగురితో కలిసి..

‘నాకు ఎవరితో సంబంధం లేదు. నాకు మంచి ఉద్యోగం ఉంది. కావాల్సినంత ఆస్తి ఉంది.’ అనుకోవడం పొరపాటు. అందరితో కలిసిపోవాలి. ‘ఒకరు ఎక్కు వ, మరొకరు తక్కువ’ అనే మాట మర్చిపోవాలి. ‘ఎక్కు వ, తక్కు వ’ అనే ఆలోచనలే గొడవలకు కారణం. ఎక్కడకు వెళ్లినా అక్కడున్న వాళ్లతో కలిసిపోవాలి. మాటలు, చేతల్లో అధికారం, డబ్బు , దర్పం కనిపించకూడదు. వాదనలు, కొట్లాటలతో సాధించలేంది, సయోధ్యతో, అందరితో కలిసిపోవడంతో సాధించొచ్చు.

ఇచ్చిపుచ్చుకుంటూ..

ఆశకు అంతు లేదు. ఒకదాని తర్వాత మరొకటి కావాలనిపిస్తుంది. కానీ తృప్తి లేకపోతే మనిషికి సుఖం ఉండదు. ‘ఇంకా కావాలి, ఇంకా కావాలి’ అనే ఆలోచనే మనిషిని అసలైన సంతోషానికి దూరం చేస్తుంది. కోరికలు ఒకదాని తర్వాత మరొకటి పుడుతూనే ఉంటాయి. తృప్తి మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఎవరికి వాళ్లు సొంతంగా పొందేది. ఉన్నదాం ట్లో ఇతరులకు ఇవ్వడం, అందరితో కలిసి బతకడం.. లాంటి వాటి వల్ల తృప్తి కలుగుతుంది.