పీఎఫ్ విత్‌డ్రా సూపర్ ఈజీ: క్యూలో నిలబడే పనిలేదు.. UPIతో సింపుల్ ప్రాసెస్..

పీఎఫ్ విత్‌డ్రా సూపర్ ఈజీ: క్యూలో నిలబడే పనిలేదు.. UPIతో సింపుల్ ప్రాసెస్..

ఈపీఎఫ్ఓ తన సబ్‌స్క్రైబర్ల కోసం ఒక భారీ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లోని డబ్బును నేరుగా యూపీఐ యాప్‌లు, ఈపీఎఫ్-లింక్డ్ ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం లభించనుంది. రాబోయే 'EPFO 3.0' డిజిటల్ ప్లాట్‌ఫామ్ కింద ఈ సరికొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని జూన్ చివరి నాటికి రోల్ అవుట్ చేసే అవకాశం ఉందని సమాచారం. 

ఈ భారీ మార్పు వెనుక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించింది. NPCI భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ కొత్త ఫెసిలిటీకి సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సరికొత్త సిస్టమ్ ద్వారా యూజర్లు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ నుండి గరిష్టంగా 75 శాతం వరకు డబ్బును యూపీఐ, యూపీఐ ఆధారిత ఏటీఎంల ద్వారా తక్షణమే తమ బ్యాంక్ ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే భవిష్యత్తు భద్రత కోసం కనీసం 25 శాతం కార్పస్‌ను అకౌంట్లోనే ఉంచడం తప్పనిసరి. ఈ నిర్ణయం వల్ల అనవసరమైన పేపర్‌వర్క్, కాలయాపన తగ్గి, పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం పీఎఫ్ డబ్బులు చేతికి రావడానికి క్లెయిమ్‌లు సబ్మిట్ చేసి, రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు తక్షణ లిక్విడిటీని అందిస్తుంది. అయితే రిటైర్మెంట్ పొదుపు డబ్బు కాబట్టి, మోసాలు జరగకుండా ఎలాంటి భద్రతా చర్యలు, అథెంటికేషన్ లాంటి సేఫ్‌గార్డ్స్ తీసుకొస్తారనేది ఇక్కడ అత్యంత కీలకం.

ఈ ఈపీఎఫ్ఓ 3.0 అప్‌డేట్‌లో భాగంగా ప్రభుత్వం మరికొన్ని కీలక మార్పులు కూడా చేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్‌ల ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ. లక్ష నుండి ఏకంగా రూ. 5లక్షలకు పెంచింది. అలాగే మెంబర్లు తమ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవడానికి మల్టిపుల్ డాక్యుమెంట్లపై ఆధారపడకుండా, ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు వేగవంతమైన UAN యాక్టివేషన్, ఆన్‌లైన్ పాస్‌బుక్ యాక్సెస్, ఆధార్-లింక్డ్ వివరాల సవరణలు మరింత సులభతరం కానున్నాయి.