ఏడాదిలోనే ఎన్‌పీడీసీఎల్‌కు రూ.2,440.36 కోట్ల నష్టం

ఏడాదిలోనే ఎన్‌పీడీసీఎల్‌కు రూ.2,440.36 కోట్ల నష్టం

హైదరాబాద్‌, వెలుగు: విద్యుత్‌ సంస్థలు  ఏటా రూ.వేల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కంలలో వరంగల్‌ కేంద్రంగా ఉన్న నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (ఎన్‌పీడీసీఎల్‌) రూ.15,426.88 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎన్‌పీడీసీఎల్‌ 2020–21 వార్షిక నివేదికను సర్కారుకు అందించింది.  గతంలో ఉన్న నష్టాలు రూ.12,983.60 కోట్లకు 2020–21 నష్టాలు కలుపుకొని  మొత్తం రూ.15,426.88 కోట్లు అయ్యాయని ప్రకటించింది.

అయితే ఇప్పటి వరకు ప్రకటించని 2021–22 నష్టాలు కలుపుకుంటే  అవి కాస్తా రూ.20 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని విద్యుత్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, 2020–21లో  రూ.2,440.36 కోట్ల నష్టాలను చవిచూశామని నార్తర్న్‌ డిస్కం తన నివేదికలో వెల్లడించింది. కరెంటు కొనుగోళ్ల కోసం  రూ.11,110.09 కోట్లు, ఉద్యోగుల బెనిఫిట్స్‌ కోసం రూ.1,808.09 కోట్లు, ఫైనాన్స్‌ కాస్ట్‌ కు రూ.695 కోట్లు వెచ్చించామని తెలిపింది. అయితే కరెంటు సరఫరా ద్వారా రూ.11,538.11 కోట్లు, ఇతర ఆదాయం రూ.160.60 కోట్లు వచ్చిందని తెలిపింది.  చేసిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం తక్కువై రూ.2,440.36 కోట్ల నష్టాలు చవిచూసింది.