- సేవలను మెరుగుపరిచేందుకు రూ.20 కోట్ల సామగ్రి
- ఉద్యోగులు, సిబ్బందికి అందుబాటులో సేఫ్టీ కిట్లు
- పవర్‌లూమ్స్ కేటగిరీలో మార్పు నేతన్నల హర్షం
సిరిసిల్ల, వెలుగు: సెస్ (సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ)ను ఇటీవల స్వాధీనం చేసుకున్న ఎన్పీడీసీఎల్ దాని పరిధిలోని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయడంతో పాటు ఉద్యోగులు, సిబ్బంది రక్షణ కోసం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరో వైపు నేతన్నల ప్రధాన డిమాండ్ అయిన కేటగిరీ మార్పునకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రూ.20 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్
సెస్ పరిధిలోని 3.70 లక్షల విద్యుత్ వినియోగదారులకు వేసవిలో ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్సరఫరా చేసేందుకు ఎన్పీడీసీఎల్(ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ) సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. ఇందులో భాగంగా రూ.20 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను ఏర్పాటుచేస్తోంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ మెటీరియల్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 120 కిలోమీటర్ల కండక్టర్ వైర్‌ను, 110 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ ఉంచింది. వేసవిలో అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడినా, అధిక లోడ్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్లను సైతం సిద్ధంగా ఉంచింది. మరో వైపు సెస్ పరిధిలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా రక్షణ కవచాలను అందిస్తోంది. ఇందులో భాగంగా సేఫ్టీ కిట్లు, గ్లౌజులు, హెల్మెట్లు, లైన్ మెటీరియల్, ఇతర అనుబంధ పరికరాలను సిబ్బందికి అందజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తితే.. వెంటనే పరిష్కరించేలా ఫీల్డ్ సిబ్బందిని అలర్ట్‌గా ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎన్పీడీసీఎల్ ఆఫీసర్లు సూచిస్తున్నారు.
కేటగిరీ మార్పు.. నేతన్నల హర్షం..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో అధిక విద్యుత్ చార్జీలతో ఇన్నాళ్లూ నేతన్నలు ఇబ్బందులుపడ్డారు. 25 హెచ్‌పీ లోపు విద్యుత్ వినియోగిస్తున్న సాంచాల మీటర్లను కేటగిరీ మూడు నుంచి నాలుగులోకి మార్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ డిమాండ్‌పై స్పందించిన ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రస్తుతం మూడో కేటగిరీలో ఉన్న సాంచాల మీటర్లను నాలుగో కేటగిరీలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. మూడో కేటగిరిలో ఒక్కో యూనిట్‌కు రూ.7.70 బిల్లు చెల్లించాల్సి ఉండగా.. కేటగిరీ 4లోకి మార్చడం వల్ల యూనిట్ కేవలం రూ.4 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇందులోనూ ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.2 ఇస్తుంది. అంటే సాంచాలను నాలుగో కేటగిరీలోకి మార్చడం వల్ల ఒక్కో యూనిట్‌కు నేతన్నలు రూ. రూ.2 చెల్లిస్తే సరిపోతుంది. సిరిసిల్ల పరిధిలో 167 సర్వీసులు ఉన్నాయి. వీటిన్నింటికీ కలిపి నెలకు రూ.70 లక్షల వరకు బిల్లులు వచ్చేవి. ప్రస్తుతం కేటగిరీ మార్పు వల్ల రూ.30 లక్షల బిల్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఎన్పీడీసీఎల్ ఆఫీసర్లు చెబుతున్నారు.
కేటగిరీ మార్పు హర్షణీయం
ఎంతో కాలంగా నేతన్నల వస్త్రోత్పత్తికి సంబంధించిన సాంచాల మీటర్ల కేటగిరీని మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ శాఖ మంత్రి భట్టి, సహకార శాఖ మంత్రి తుమ్మలకు సైతం వినతి పత్రాలు ఇచ్చాం. ప్రస్తుతం ప్రభుత్వం కేటగిరీ మార్పు కోసం తీసుకున్న నిర్ణయం వల్ల నేతన్నలకు మేలు జరగనుంది.
– ఆడేపు భాస్కర్, పాలిస్టర్ అసోసియషన్ ప్రెసిడెంట్, సిరిసిల్ల
