ఎన్ఎస్ఈలో మరోసారి సాంకేతిక సమస్య

ఎన్ఎస్ఈలో మరోసారి సాంకేతిక సమస్య

న్యూఢిల్లీ: దేశీయ ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఈలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని స్టాక్‌ ధరలు తెరపై అప్‌డేట్‌ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్ఛేంజీ దృష్టికి తీసుకొచ్చాయి. నిఫ్టీ సహా మరికొన్ని ఇండెక్స్‌ల ధరలు కూడా తెరపై కనిపించలేదని పేర్కొన్నాయి. ఏడాది క్రితం కూడా ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న భారీ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏకంగా ఎక్స్ఛేంజీని 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. తాజా సమస్యతో ఎన్ఎస్ఈ వినియోగిస్తున్న టెక్నాలజీ, ఆటోమేషన్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై ఎన్ఎస్ఈ స్పందిస్తూ.. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అప్పుడప్పుడు ధరలు తెరపై అప్ డేట్ కాలేదని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం అన్ని సూచీలు సాధారణంగానే పని చేస్తున్నాయని వివరించింది. కాగా, సమస్య తలెత్తినప్పుడు ధరలు మాత్రమే అప్ డేట్ కాలేదని.. ఆర్డర్లు మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యాయని బ్రోకరేజీ సంస్థలు పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

ఒంటరిగా యుద్ధభూమిని దాటిన చిన్నారి

యుద్ధానికి మరోసారి బ్రేక్

జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న ప్లాన్ రెడీ