ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి బలవన్మరణం

ఎన్టీఆర్ కూతురు ఉమా మహేశ్వరి బలవన్మరణం

మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ నాల్గో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమా మహేశ్వరి మృతివార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు, లోకేష్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి సురేష్  తదితరులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. అటు విదేశాల్లోని కుటుంబసభ్యులకు ఆమె మృతి విషయాన్ని  అందించారు. 

మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి తన బెడ్ రూంలోకి వెళ్లినట్లు ఆమె కుమార్తె దీక్షిత చెప్పారు. భోజనం చేసేందుకు బయటకు రాకపోవడంతో మధ్యాహ్నం 2గంటల సమయంలో వెళ్లి తలుపుకొట్టగా ఎలాంటి స్పందన రాలేదు. అనుమానంతో దీక్షిత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డోర్ ఓపెన్ చేయగా.. ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీక్షిత ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కాసేపట్లో డాక్టర్లు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం అనంతంర భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించనున్నారు. మార్చురి వద్ద ఉమా మహేశ్వర సోదరులైన బాలకృష్ణ, రామకృష్ణతో పాటు నారా లోకేష్ ఉన్నారు. 

ఉమా మహేశ్వరి మృతిపై టిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని తీగల గుర్తు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఉమా మహేశ్వరి మరో కుమార్తె హైదరాబాద్ చేరుకుంటారని తీగల చెప్పారు.