అణుబాంబులు వాడొద్దు మొర్రో అని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. దానికి వ్యతిరేకంగా తీర్మానాలూ చేసేస్తున్నాయి. కానీ, అదేంటో స్పేస్ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మాత్రం ఎహె.. అణుబాంబులేసేద్దామనేస్తున్నారు. అయితే భూమ్మీద కాదులెండి. మార్స్ మీద వేద్దామంటున్నారు. అంగారక గ్రహంపై ఇప్పటికే జీవం ఉనికి కోసం ప్రయత్నాలు షురూ చేశారు కదా. నాసా క్యూరియాసిటీ రోవర్ ఇప్పటికే మార్స్‌పై కలియతిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మనిషి బతకగలిగేలా ఓ పెద్ద అణుబాంబు వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నారు. అణుబాంబు పేలుడు వల్ల మార్స్ ధ్రువాల వద్ద మంచు కరిగి, పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ గాల్లోకి విడుదలవుతుందని, గ్రీన్హౌస్ ఎఫెక్ట్ పడి ఉష్ణోగ్రతలు, గాలి ఒత్తిడి పెరిగి గ్రహంపై వాతావరణం మారిపోతుందని ఆయన భావిస్తున్నారు. జీవం మనుగడకు దారి చూపుతుందని అన్నారు.
