నూహ్​లో మళ్లీ టెన్షన్ టెన్షన్

నూహ్​లో మళ్లీ టెన్షన్ టెన్షన్

నూహ్(హర్యానా): హర్యానాలోని నూహ్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం శోభాయాత్ర నిర్వహిస్తామని హిందూ సంఘాలు చెప్పడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 2,000 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 24 కంపెనీల పారా మిలటరీ బలగాలతో జిల్లావ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జనాలు గుమిగూడకుండా 144 సెక్షన్ విధించి,ఇంటర్​నెట్​ సస్పెండ్ చేశారు. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం సెలవు ప్రకటించారు. దుకాణాలు, మార్కెట్లు మూసివేయాలని ముందుగానే హెచ్చరించడంతో స్థానికులెవరూ తెరవలేదు. జిల్లా బార్డర్లను మూసివేసి పోలీసులు ఇతర జిల్లాలవారెవరినీ లోపలికి అనుమతించలేదు. 

15 మంది సాధువులకు అనుమతి

శ్రావణ మాసం సోమవారం కావడంతో శోభాయాత్ర నిర్వహిస్తామని సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్  పట్టుబట్టింది. దీంతో నూహ్ జిల్లా నల్హర్ ప్రాంతంలోని శివాలయంలో పూజలు చేసేందుకు అధికారులు 15 మంది సాధువులకు మాత్రం అనుమతిచ్చారు. హిందూ ధర్మకర్త పరమహంస ఆచార్య వాహనాన్ని సోహ్నా దగ్గరలో పోలీసులు అడ్డుకున్నారు. నల్హర్​ ఆలయంలో 
ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయని, 15 మంది సాధువుల బృందం జలాభిషేకం చేసి ఫిరోజ్​పూర్​లోని ఝిర్  ఆలయానికి బయల్దేరిందని బజరంగ్ దళ్ గురుగ్రామ్​ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ మీడియాకు తెలిపారు. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా శోభా యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారమే స్పష్టం చేశారు.