
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024) జనవరి 1వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే నుమాయిష్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 46 రోజుల పాటు సాగే నుమాయిష్- ఎగ్జిబిషన్ కు టికెట్ ధరలు, విజిటింగ్ అవర్స్ లల్లో ఎటువంటి మార్పు చేయలేదు నిర్వాహకులు. గతేడాది టికెట్ ధరలనే కొనసాగించనున్నారు. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు.
నుమాయిష్ సందర్శన వేళలను వారాంతపు రోజులలో సాయంత్రం 4 నుండి రాత్రి 10.30 వరకు నిర్ణయించారు. అయితే.. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయిస్తున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలకు నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు.
ఇటీవల నుమాయిష్ పై నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ వనం, కార్యదర్శి హనుమంతరావుతో కలిసి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నుమాయిష్ ను గతం కంటే అట్టహాసంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ను లక్షలాది మంది సందర్శిస్తారని చెప్పారు. ఈసారి 2500 వరకు స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న వ్యాపారులు పాల్గొంటారని వివరించారు. కరోనా ప్రభావం ఉన్నందున సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.