హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 25 నుంచి నుమాయిష్ ప్రారంభించినున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు చెప్పింది. జనవరి 1న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభమైంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు మరుసటి రోజే అర్థాంతరంగా స్టాళ్లను మూసివేశారు. తాజాగా కొవిడ్ నిబంధనలు సడలించడంతో నుమాయిష్ నిర్వాహణపై ఎగ్జిబిషన్ సొసైటీ సమావేశం నిర్వహించింది. 25 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు, శని, ఆదివారాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయని సొసైటీ సెక్రటరీ ఆదిత్య మార్గం స్పష్టంచేశారు.
ఈ ఏడాది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 2000 స్టాళ్లతో నుమాయిష్ ఏర్పాటు చేశారు. కొవిడ్ కారణంగా ఎగ్జిబిషన్ మూతపడటంతో దాదాపు 30శాతం మంది వ్యాపారులు డబ్బు వెనక్కి తీసుకొని వెళ్లిపోయారు. మిలిగిన 70శాతం మంది నుమాయిష్ ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు వ్యాపారాలు నిర్వహిస్తామని అడ్వాన్స్ వెనక్కి తీసుకోలేదు. ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ స్టాళ్ల నిర్వాహకులందరికీ సొసైటీ ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా సమాచారం అందిస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
ఫిబ్రవరి 17ను రైతుబంధు దినోత్సవంగా నిర్వహిస్తాం
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

