- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు
- సమ్మెటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలకూ ఆరు పేపర్లే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 9,10 తరగతుల స్టూడెంట్లకు సమ్మెటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామ్స్ కూడా ఆరు పేపర్లతోనే నిర్వహించాలని డీఈఓలను ఆమె ఆదేశించారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మెటివ్ అసెస్మెంట్ –1 పరీక్షలు మాత్రం11 పేపర్లతో కొనసాగిస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సైన్స్ సబ్జెక్టుకూ ఒకే పేపర్ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. గత కొన్నేండ్లుగా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులను11 పేపర్లతో నిర్వహిస్తున్నారు. హిందీ మినహా మిగిలిన తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు రెండేసీ పేపర్లు పెడుతున్నారు. అయితే దాదాపు 10, 12 ఏండ్లుగా పేపర్లను తగ్గించాలనే డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా టైమ్‌లో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. సైన్స్‌లో ఫిజిక్స్, బయోలజీ క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లూ వేర్వేరుగా ఇచ్చారు. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చిన తాజా ఆదేశాలతో ప్రతి సబ్జెక్టుకూ ఒకే పేపర్ తో పరీక్ష ఉంటుంది.
సైన్స్ పేపర్ వాల్యుయేషన్ ఎట్లా?
ప్రస్తుతం టెన్త్‌లో జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, బయోలజీ సబ్జెక్టులకు వేర్వేరు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. వాల్యుయేషన్ కూడా వేర్వురుగానే చేస్తారు. తాజాగా డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. సైన్స్‌లో ఒకే పేపర్ పెడితే వాల్యుయేషన్ ఎలా చేస్తారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అధికారులకు అవగాహన లేకుండానే ఉత్తర్వులు ఇస్తున్నారని, దీంతో కింది స్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సైన్స్ సబ్జెక్టుపై క్లారిటీ ఇవ్వాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
