ఐసోలేషన్‌లో ఉన్న తల్లి.. బిడ్డకు పాలిచ్చిన నర్స్

V6 Velugu Posted on May 28, 2021

సలాం.. నర్స్​ అమ్మ..! 

కరోనా పాజిటివ్​ వచ్చిన  వాళ్లకి మందులు, మాత్రలు ఇవ్వడమే కాదు, వాళ్లలో ధైర్యం నింపుతారు నర్సులు. అంతేకాకుండా ఒక్కోసారి వాళ్ల పిల్లల్ని కూడా చేరదీస్తున్నారు. నిర్మల్​​ జిల్లా భైంసాలోని ప్రభుత్వ దవాఖానలో నర్సుగా పనిచేస్తోంది సునీత. కరోనా సోకిన మూడు నెలల బాలింత బిడ్డకు చనుబాలు పట్టి తన తల్లి మనసు చాటుకుంది. అమ్మ ప్రేమను పంచిన సునీతకు సలాం అంటున్నారంతా.... 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కరోనా బాధితురాలి బిడ్డకు పాలు పట్టి, అమ్మలా లాలించిన సునీతది  జగిత్యాల. ఆమె గత తొమ్మిదేళ్లుగా నిర్మల్​ జిల్లా భైంసాలోని సర్కారు దవాఖానలో నర్సుగా పనిచేస్తోంది. 20 రోజుల క్రితం నిర్మల్ దగ్గర్లోని ఒక ఊరికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్​ వచ్చింది.

ఇద్దరూ క్వారంటైన్​లో ఉండాల్సిన పరిస్థితి. దాంతో తమ మూడు నెలల  పసివాడికి పాలు ఇవ్వడం, బిడ్డ ఆలనాపాలన చూడడం ఎలా అనే బెంగ పట్టుకుంది ఆ దంపతులకు. వాళ్ల ఇంట్లోనే ​ కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు సునీత భర్త మహేందర్. అతని ద్వారా ఆ పసికందు ఆకలి బాధ తెలుసు కున్న  సునీత అమ్మ మనసు కరిగిపోయింది.  ఆ మూడు నెలల చంటి బిడ్డకు  పాలిచ్చి మానవత్వం చాటుకుంది సునీత. దవాఖానకు వచ్చే వాళ్లకి  సేవలు చేయడం, మందులు ఏ వేళకు వేసుకోవాలో చెప్పడమే కాదు వారి మంచి చెడ్డలు అరుసుకుంటుంది సునీత. 

తనే అమ్మగా...
సునీత దంపతులకు ఏడాది వయసు బాబు ఉన్నాడు. నర్సుగా పనిచేస్తున్న సునీతకు నెలల వయసు పిల్లలకు తల్లి అవసరం ఎంత ఉంటుందో బాగా తెలుసు. పదిరోజులు కరోనా బాధితురాలి బిడ్డకు చనుబాలు పట్టింది ఈ నర్సమ్మ. కొవిడ్​ బారిన పడిన బాలింత బిడ్డ ఆకలి తీర్చిన ఆమె తల్లి మనసును వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు, జనమంతా మెచ్చుకుంటున్నారు. 

చంటి బిడ్డ బాధ తెలుసు
బాలింతల్లో కొందరికి  ముర్రుపాలు తక్కువగా వస్తుంటాయి. నేను నర్సును మాత్రమే కాదు ఒక బిడ్డకు తల్లిని కూడా. అందుకే పసి బిడ్డల బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే ఆ పసివాడికి పాలిచ్చాను. ఇప్పుడు ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. అమ్మగా నాకు ఇంతకన్నా సంతోషం ఏం ఉంటుంది. 
- సునీత, నర్స్​

Tagged Telangana, coronavirus, Nirmal, Bhainsa, nurse sunitha, feeding milk

Latest Videos

Subscribe Now

More News