స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీలో అన్యాయం .. కోఠిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన

స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీలో అన్యాయం .. కోఠిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన
  • వెయిటేజీ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం
  • ఎక్కువ మార్కులు వచ్చినా.. మెరిట్‌‌‌‌ లిస్టులో పెట్టలేదని వెల్లడి
  • జోన్‌‌‌‌ వైజ్ కటాఫ్ ఇవ్వక.. గందరగోళం

హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంత మంది అభ్యర్థులు కోఠిలోని మెడికల్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారి హాల్‌‌‌‌ టికెట్ నంబర్లు మెరిట్‌‌‌‌ లిస్టులో ఉన్నాయని, తమ నంబర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్‌‌‌‌సోర్సింగ్ వెయిటేజీకి సంబంధించిన మార్కులు తమకు కలవలేదంటూ మరికొందరు ఆరోపించారు.

 దీనిపై స్పందించిన బోర్డు అధికారులు, బోర్డు వద్దకు వచ్చిన అభ్యర్థుల అందరి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. వాటిని టెక్నికల్ టీమ్స్ తోపాటు సంబంధిత అధికారులతో వెరిఫై చేయిస్తామన్నారు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినట్టు తేలితే, వారి సర్టిఫికెట్లను రీ వెరిఫై చేసి మెరిట్‌‌‌‌ లిస్టును అప్‌‌‌‌డేట్ చేస్తామని బోర్డు మెంబర్ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు.

కటాఫ్ ప్రకటనలో నిర్లక్ష్యం

స్టాఫ్ నర్స్ పోస్టులను జోనల్ కేడర్‌‌‌‌‌‌‌‌లో భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో జోన్లు, రిజర్వేషన్ల వారీగా కటాఫ్ మార్కులు ప్రకటించాల్సిన బోర్డు.. ఆ పని చేయలేదు. కనీసం జోన్ల వారీగా కూడా మెరిట్ లిస్టులు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ మార్కులు వచ్చినా.. తమ నంబర్ మెరిట్ లిస్టులో లేకపోవడంతో తమకు నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఒక్కో జోన్‌‌‌‌లో ఒక్కో కటాఫ్ ఉండడమే ఇందుకు కారణం. అయితే, ఈ విషయం స్పష్టంగా అభ్యర్థులకు తెలిసేలా అధికారులు ప్రకటన చేయకపోవడంతో తమకు అన్యాయం జరిగిందంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు.

ఇయ్యాల్టి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌

గురువారం ప్రకటించిన మెరిట్‌‌‌‌ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం నుంచి ఫిజికల్‌‌‌‌గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది. బండ్లగూడ జాగిర్‌‌‌‌‌‌‌‌లోని ఎక్సైజ్‌‌‌‌ అకాడమీలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొంది. ఎవరెవరు ఏరోజు వెరిఫికేషన్​కు రావాలో అభ్యర్థులకు తెలిసేలా నోట్ విడుదల చేశారు. దరఖాస్తు సమయంలో అప్‌‌‌‌లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌‌‌‌కు రావాలని అభ్యర్థులకు సూచించారు. రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్‌‌‌‌ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకు రావాలని పేర్కొన్నారు.