NZ vs PAK: అదే ఆట.. అదే ఫలితం.. కివీస్ చేతిలో చిత్తైన పాకిస్తాన్

NZ vs PAK: అదే ఆట.. అదే ఫలితం.. కివీస్ చేతిలో చిత్తైన పాకిస్తాన్

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఓటములే తప్పే గెలుపును చూడలేకపోతున్నారు. అంతో ఇంతో ఆ జట్టు విజయాల గురించి చెప్పాలంటే.. భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లోనే. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షణాఫ్రికా, అఫ్ఘనిస్తాన్ జట్ల చేతిలో ఓడినా.. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, శ్రీలంకపై విజయం సాధించింది. ఈ టోర్నీ అనంతరం పాక్ జట్టు విజయాన్ని చూసి దాదాపు రెండు నెలలు గడుస్తోంది. వారం రోజులక్రితం ఆస్ట్రేలియా పర్యటనలో 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాక్.. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపైనా అదే దారిలో పయనిస్తోంది.

శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్ నిర్ధేశించిన 226 పరుగుల ఛేదనలో పాక్ 180కే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. కేన్ విలియంసన్ (57), డారిల్ మిచెల్(61) హాఫ్ సెంచరీలు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీసుకున్నారు. 

సైమ్ అయూబ్ 

అనంతరం 227 పరుగుల భారీ ఛేదనలో పాకిస్తాన్ కు ఓపెనర్లు సైమ్ అయూబ్(27; 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లు), మహ్మద్ రిజ్వాన్(25; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరి ధాటికి పాక్ తొలి ఐదు ఓవర్లలోనే 62 పరుగులు చేసింది. అనంతరం వీరిద్దరూ వెనుదిరిగాక.. పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ఒక ఎండ్ నుంచి బాబర్ ఆజం(57; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు) పోరాడినా.. మరో ఎండ్ నుంచి అతనికి సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఛేదనలో పాక్ 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(జనవరి 14) హామిల్టన్ వేదికగా రెండో టీ20 జరగనుంది.