
నిజామాబాద్ జిల్లాలొ మాస్ నేతగా పేరున్న ఓ శాసన సభ్యుడి అనుచరుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఆయన పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనుచరులు. షాడో ఎమ్ఎల్ఏ లుగా వ్యవహరిస్తూ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో భూ కబ్జాలకు పాల్పడ్డ అనుచరులు, ఇప్పుడు పక్క నియోజక వర్గాల్లోనూ సెటిల్మెంట్లు చేస్తుండటంపై వివాదం రాజుకుంది.
2013 లో నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ గ్రామంలోని 106 సర్వే నంబరు లో 16 ఎకరాల స్థలం జిల్లా ఒలింపిక్ అసోసియేష్ కు కేటాయించారు. 656 గజాల స్థలంలో భవన నిర్మాణానికి 15 లక్షల రూపాయలను అప్పటి మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోటా నుంచి నిధులు కూడా కేటాయించారు. భవనాలు, స్టేడియం నిర్మాణానికి కూడా శంకు స్థాపన జరిగింది. నిధులు లేకపోవటంతో బేస్ మెంట్ పనులు మధ్యలోనే నిల్చిపోయాయి. కొన్నేళ్ళుగా ఆ స్థలం పిచ్చి మొక్కలతో ఖాళీగా కనపడుతోంది. ఎమ్మెల్యే అనుచరులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేసి స్థలం కబ్జా చేశారు. దీంతో క్రీడా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. క్రీడాకారులు, విద్యార్థులు ఆందోళన బాట పట్టినా పట్టించుకోలేదు.
ఒక్క ఒలింపిక్ అసోసియేషన్ భవనమే కాదు.. జిల్లా బస్టాండు ముందు అర్దరాత్రి రౌడీలను పెట్టి ఓ క్లాంపెక్స్ కూల్చటం, విజయ్ థియేటర్ పక్కన ఓ అపార్ట్ మెంట్ యజమానిని భయపెట్టి బిల్డింగ్ సొంతం చేసుకోవడం, బస్వా గార్డేన్ పక్కన విలువైన 300 గజాల స్థలం దొంగ రిజిస్ట్రేషన్, కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో ఓ వృద్ద దంపతులను భయపెట్టి స్థలం ఆక్రమించడం…. ఇలా చెప్పుకుంటూ పోతే… నిజామాబాద్ జిల్లాలో ఎమెల్యే అనుచరుల కబ్జాల కహానికి అంతే లేదు.
ఎమ్ఎల్ఏ అనుచరుల ఆగడాలు ఎక్కువవడంతో… ఈ విషయం సీఎంకి కూడా చేరింది. దీంతో ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేపై కోపంగా ఉన్నట్లు సమాచారం. అనుచరుల ఆగడాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న సీఎం… రేపో, మాపో పిలిచి మాట్లాడతారని అంటున్నారు. మంత్రి కాలేకపోయినా ఏదైనా కార్పోరేషన్ పదవి వస్తుందనుకున్న ఆ ఎమ్మెల్యే… ఇప్పుడు అనుచరుల వల్ల ఏం జరుగుతుందో అని ఆందోళనలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యే అనుచరులు పక్క నియోజకవర్గాల్లోనూ.. భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేయడంపై స్థానిక నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు, అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అండతోనే ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని నగర వాసులు ఆరోపిస్తున్నారు. సామాన్యులు, మద్యతరగతి జనం… రూపాయి రూపాయి కూడబెట్టి స్థలాలు కొనుక్కుంటే.. వాటిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తుండటంతో… సామాన్యులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.