- దేశంలోనే తెలంగాణకు నాలుగో ప్లేస్
- 70 లక్షల వాహనాలతో మొదటి స్థానంలో కర్నాటక
- కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్,వెలుగు: తెలంగాణలో పాత వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. 15 నుంచి 20 ఏండ్లు దాటిన వెహికల్స్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. రోజుకు 3 వేల నుంచి 4 వేల వరకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అవుతుండగా, వాటి స్థానంలో కాలం తీరుతున్న వాహనాలు రెట్టింపు అవుతున్నాయి. కాలం చెల్లిన వాహనాలున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్టు ఇటీవల కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. దేశంలో పాత వాహనాలు దాదాపు 4 కోట్ల వరకు ఉన్నట్టు తేలింది. ఇందులో 20 ఏండ్లు పై బడిన కాలం తీరిన వాహనాలు 2 కోట్లకు పైగా ఉన్నట్టు వెల్లడయ్యింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆర్టీఏ అధికారులు పాత వాహనాల గణాంకాలు తీయడం ప్రారంభించారు. పూర్తిస్థాయిలో రికార్డులు బయటకు రాకున్నా తెలంగాణలో వీటి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు తెలిసింది. పాత వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకునేందుకు వాహన దారులు తరచూ వాటి ఇంజన్ సామర్థ్యం, పొల్యూషన్ టెస్ట్‌లు నిర్వహించుకుంటూ ఉండాలని అధికారులు తెలిపారు. 15 ఏండ్లు దాటిన పర్సనల్ వెహికల్స్‌కు ఇంజన్ సామర్థ్య పరీక్షలతో పాటు కాలుష్య పరీక్షలు నిర్వహించుకుని గ్రీన్ టాక్స్చెల్లిస్తే.. వాటిని తిరిగి నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.
భారీగా కాలం చెల్లిన వాహనాలు
తెలంగాణలో పెద్ద సంఖ్యలో కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల వాహనాలు ఉండగా, ఇందులో 20 ఏండ్లు పూర్తయిన వ్యక్తిగత వాహనాలు దాదాపు 15 లక్షల వరకు ఉంటాయని తెలిపారు. 15 ఏండ్లు దాటిన రవాణా వాహనాలు మరో 3.5 లక్షల వరకు ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో 15 ఏండ్లు దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ కోసం నోటీసులు జారీ చేస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కర్ణాటక ఫస్ట్..
దేశంలో కాలం తీరిన వాహనాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్నాటక మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 70 లక్షలకు పైగా కాలం తీరిన వాహనాలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. రెండోస్థానంలో ఢిల్లీ ఉండగా.. ఈ రాష్ట్రంలో 60 లక్షలకు పైగాకాలం తీరిన వాహనాలు ఉన్నాయి. అలాగే 57 లక్షలకు పైగా వాహనాలతో ఉత్తరప్రదేశ్ మూడోస్థానంలో ఉండగా.. 15.5 లక్షల కాలం చెల్లిన వెహికల్స్‌తో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
అనుమతి ఇలా..
- ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 8 ఏండ్లు దాటితే గ్రీన్‌టాక్స్ చెల్లించాలి. వాహనాన్ని బట్టి టాక్స్ ఉంటుంది.
- వ్యక్తిగత వెహికల్స్‌కు రిజిస్టర్ అయిన రోజు నుంచి 15 ఏండ్ల వరకు గడువు ఉంటుంది. తర్వాత వాటికి ఇంజన్ పరీక్షలు, పొల్యూషన్ టెస్టులు నిర్వహించుకుని సర్టిఫికెట్పొంది గ్రీన్‌టాక్స్ చెల్లించి నడుపుకోవచ్చు.
- ద్విచక్ర వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్ రూ. వెయ్యి, కారుకు రూ.5 వేలు, ట్యాక్సీ రూ.7 వేలు, బస్సు, లారీలకు రూ.13 వేలు చెల్లించాలి.
