- ఈ ఇద్దరి కోసమే విజయ్ హజారే మ్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్
- వరల్డ్ కప్ ఒక్కటే ఉండాలి.. టెస్ట్, టీ20ల భవిష్యత్‌కు ఢోకా లేదు
చెన్నై: వన్డే వరల్డ్ కప్–2027 తర్వాత ఈ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతుందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వన్డేల భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు. రో–కో జోడీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం వల్లే ఈ మ్యాచ్‌లను చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఆసక్తి చూపెట్టారని గుర్తు చేశాడు. ‘2027 వరల్డ్ కప్ తర్వాత వన్డేల భవిష్యత్ గురించి ఎవరూ కచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు. దీనిపై నాకూ కాస్త ఆందోళనగానే ఉంది. టీ20లు పెరిగిపోతుండటం... టెస్ట్ క్రికెట్‌కు సొంతంగా అభిమానులు ఉండటం వల్ల వన్డేలకు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీని చూసినంతగా ఫ్యాన్స్ విజయ్ హజారేను చూడలేకపోతున్నారు. వీహెచ్‌టీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచ్‌లకు మాత్రం మంచి డిమాండ్ కనిపించింది. ఒకవేళ ఈ ఇద్దరు వన్డేలు ఆడటం మానేస్తే ఏం జరుగుతుందనేదే పెద్ద ప్రశ్న’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌లో వ్యాఖ్యానించాడు. వ్యక్తుల కంటే క్రీడ పెద్దదే అయినప్పటికీ సందర్భోచితంగా దానికి డిమాండ్ తీసుకొచ్చేందుకు ప్లేయర్లు కృషి చేయాలన్నాడు.
బ్యాటింగ్ శైలి మారింది..
టీ20ల కారణంగా వన్డే బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయిందని అశ్విన్ అన్నాడు. ఇన్నింగ్స్‌ను ఎలా నియంత్రించాలో తెలియడం లేదన్నాడు. ‘ఒకప్పుడు వన్డే క్రికెట్ అద్భుతమైన ఫార్మాట్. ఎందుకంటే ధోనీలాంటి ప్లేయర్ 10, 15 ఓవర్లు సింగిల్స్, డబుల్స్ తీసి చివర్లో భారీ హిట్టింగ్ చేసేవాడు. అలాంటి ప్లేయర్లను ఇప్పుడు చూడలేకపోతున్నాం. అలాంటి వాళ్ల అవసరం కూడా ఉండటం లేదు. ఎందుకంటే రెండు కొత్త బాల్స్‌తో ఐదుగురు ఫీల్డర్లతో సర్కిల్ లోపల ఆడుతున్నారు. అలాంటప్పుడు బ్యాటర్ హిట్టింగ్ చేయడం లేదంటే ఔట్ అవ్వడం జరుగుతుంది. పిచ్ కఠినంగా ఉంటే 120 రన్స్‌కే ఆలౌటవుతున్నారు’అని అశ్విన్ పేర్కొన్నాడు. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఆదాయాన్ని పెంచుకోవడం సరైందే అయినా.. ఐసీసీ తన క్యాలెండర్‌ను పునః పరిశీలించాలని కోరాడు. ‘వన్డే ఫార్మాట్ మనుగడే కష్టమవుతోంది. దానిని అధిగమించడానికి ఐసీసీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వరల్డ్ కప్స్‌ను ఎలా నిర్వహిస్తారో చూడాలి. ఆదాయం కోసం ప్రతి ఏడాది ఏదో ఓ ఐసీసీ టోర్నీ ఉంటుంది. కానీ దాన్ని ఫిఫా తరహాలో ప్లాన్ చేయాలి. ఫుట్‌బాల్‌లో చాలా లీగ్‌లు జరుగుతాయి. కానీ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి చాలా ప్రతిష్టాత్మకంగా వరల్డ్ కప్‌ను నిర్వహిస్తారు. దాని విలువ ఎప్పుడూ తగ్గదు. క్రికెట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లు, చాలా ఫార్మాట్స్, చాలా వరల్డ్ కప్స్ ఉండటం వల్ల ఆటను దెబ్బతీస్తున్నాయి’ అని అశ్విన్ వెల్లడించాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇండియా.. అమెరికా, నమీబియాతో ఆడే మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ తక్కువగా ఉంటుందన్నాడు.
వరల్డ్ కప్ ఒక్కటే ఉండాలి..
వన్డే క్రికెట్‌కు సరైన పరిష్కారం లభించాలంటే వరల్డ్ కప్ ఒక్కటే ఉండాలని అశ్విన్ సూచించాడు. ‘సచిన్‌లాంటి వాళ్లు వన్డేలకు ఇన్నింగ్స్‌ను స్ప్లిట్ చేయాలని సూచించారు. అయినప్పటికీ నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే వరల్డ్ కప్ మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే ఉండాలి. టీ20 లీగ్‌లు ఎన్నైనా ఆడండి. కానీ వరల్డ్ కప్ మాత్రం ఒక్కటే ఉండాలి. అది కూడా నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ఆడాలి. అప్పుడు ప్రజలకు ఈ ఈవెంట్ మీద ఆసక్తి పెరుగుతుంది. లేదంటే నెమ్మదిగా ఆసక్తి తగ్గడం మొదలవుతుంది’ అని అశ్విన్ వివరించాడు.
