ఒడిశా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాజీనామాకు సిద్దమయ్యారు. SIR ప్రక్రియను పర్యవేక్షించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ఆర్. సంతాన గోపాలన్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ తర్వాత ఓట్ల తొలగింపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఒడిశా కాంగ్రెస్, బీజేడీ పార్టీలు ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈక్రమంలో గోపాలన్ రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
2001 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి గోపాలన్.. ఒడిశాలో SIR ప్రక్రియ పూర్తై, సవరించిన ఓటర్ల జాబితా విడుదలైన వారం రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన గోపాలన్‌కు ఇంకా సుమారు 18 నెలల సర్వీసు ఉంది. అయితే కొంతకాలంగా పదవీ విరమణపై ఆలోచిస్తున్న ఆయన.. SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
SIR ప్రక్రియ ముగిశాక సెప్టెంబర్ 21న ఒడిశా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3.16 కోట్ల మంది ఓటర్లు ఉండగా సుమారు 17 లక్షల పేర్లు తొలగించడంపై ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తాయి. ఆందోళనలకు దిగాయి.
గోపాలన్ 2024 జూలై నుంచి ఒడిశా CEOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమారు 25 ఏళ్ల సర్వీసులో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. దేశవ్యాప్తంగా SIR ప్రక్రియపై ఎన్నికల సంఘం విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో గోపాలన్ వీఆర్‌ఎస్ అప్లికేషన్ చర్చనీయాంశంగా మారింది.
