
భువనేశ్వర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ వారిపట్ల కర్కశకంగా వ్యవహరించింది. తన కాళ్లు మొక్కలేదన్న కారణంతో విద్యార్థులను చితకబాదింది. ఒక్కరు కాదు ఇద్దరూ ఏకంగా 31 మంది విద్యార్థులను ఇదే కారణంతో విచక్షణరహితంగా కొట్టింది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది.
వివరాల ప్రకారం.. మయూర్‌భంజ్ జిల్లా బెట్నోటి బ్లాక్‌లోని ప్రతిమదీపూర్ క్లస్టర్ పరిధిలోని ఖండదేవులా ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో సుకాంతి కర్ అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తుంది. రోజు మాదిరిగానే 2025, సెప్టెంబర్ 12న స్కూల్‌కు వెళ్లింది. అయితే, ప్రార్థన తర్వాత విద్యార్థులు ఆమె కాళ్లకు నమస్కరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుకాంతి కర్ విద్యార్థులను కర్రతో విచక్షణరహితంగా కొట్టింది.
6, 7వ తరగతులకు చెందిన మొత్తం 31 మంది విద్యార్థులను ఇదే కారణంతో చితకబాదింది. టీచర్ దాడిలో ఒక బాలుడి చేతి వేలు చిట్లిపోయింది. విషయం తెలుకున్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC)కి ఫిర్యాదు చేశారు. పిల్లలపై నిర్ధాక్షిణ్యంగా దాడి చేసిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
దీంతో ప్రధానోపాధ్యాయుడు వెంటనే ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశాడు. రంగంలోకి దిగిన అధికారులు ఈ ఘటనపై దర్యా్ప్తు చేపట్టారు. కాళ్లకు నమస్కరించలేదన్న కారణంతో సుకాంతి కర్ 31 మంది విద్యార్థులను చితకబాదినట్లు నిర్ధారించారు అధికారులు. ఈ మేరకు శాఖపరమైన చర్యల్లో భాగంగా ఆమెను సస్పెండ్ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ విధుల అమల్లో ఉంటాయని తెలిపారు.