
- ఒడిశా రైలు ప్రమాదం తర్వాత శవాలను స్కూళ్లోనే భద్రపరిచిన్రు
- తరగతి గదిని తాత్కాలిక మార్చురీగా మార్చిన అధికారులు
- స్కూల్కు వచ్చేందుకు పిల్లలు భయపడుతుండడంతో నిర్ణయం
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయినోళ్ల డెడ్ బాడీలను ఉంచిన బడిని కూల్చివేస్తున్నారు. బాలాసోర్ బాహనగాలోని ప్రభుత్వ హైస్కూల్ కూల్చివేత పనులు శుక్రవారం మొదలుపెట్టారు. ఈ బడిలో మృతదేహాలను ఉంచడంతో క్లాసులకు రావడానికి స్టూడెంట్లు భయపడుతున్నారు. బడిలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న డెడ్ బాడీలను చూసిన స్థానికులు కూడా ఆ పరిసరాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. దీంతో బడిని కూల్చివేయాలని స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయించింది. స్కూల్ కట్టి కూడా 65 ఏండ్లు అయిందని, బిల్డింగ్ పాతదైపోయిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పాత బిల్డింగ్ ను కూల్చేసి, దాని స్థానంలో అన్ని వసతులతో మోడల్ స్కూల్ కట్టాలని విజ్ఞప్తి చేసింది.
‘‘త్వరలో స్కూల్ ప్రారంభం కానుంది. కానీ స్కూల్ కు రావడానికి విద్యార్థులు భయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పంపించేందుకు సిద్ధంగా లేరు” అని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం బాలాసోర్ కలెక్టర్ దత్తాత్రేయ స్కూల్ ను సందర్శించి స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. పిల్లల్లో భయం పోగొట్టేందుకు కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ, గ్రామస్తుల విజ్ఞప్తితో ప్రభుత్వం కూడా బడిని కూల్చేందుకు ఓకే చెప్పింది.
అధికారులతో గురువారం మీటింగ్ నిర్వహించిన సీఎం నవీన్ పట్నాయక్.. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ తో మోడల్ స్కూల్ కట్టాలని ఆదేశించారు. కాగా, ఈ నెల 2న జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయినోళ్ల డెడ్ బాడీలను మొదట ఈ స్కూల్ కే తరలించారు. టెంపరరీ మార్చురీగా మార్చి, రెండ్రోజుల పాటు డెడ్ బాడీలు ఇక్కడే ఉంచారు. ఆ తర్వాత భువనేశ్వర్ లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది చనిపోయారు. ఇంకా 80 మందిని గుర్తించకపోవడంతో, వాళ్ల డెడ్ బాడీలు భువనేశ్వర్ లోని ఎయిమ్స్ మార్చురీలోనే ఉన్నాయి.