కరోనా వచ్చిందని మనస్తాపం.. ఇంటెనకాల బావిలోకి దూకి ఆత్మహత్య

కరోనా వచ్చిందని మనస్తాపం.. ఇంటెనకాల బావిలోకి దూకి ఆత్మహత్య

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట: కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా కూడా ఎంతో మందని బలి తీసుకుంటోంది. ఒకవైపు ఎంతో మంది కరోనాను లెక్కచేయకుండా.. అవసరం వస్తే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ తిరుగుతుంటే.. మరికొంత మంది కేవలం అనుమానంతో.. అవమానంగా భావించుకుంటూ.. మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చిన ఓ వ్యక్తి  భయాందోళనలకు గురై… ఇంటెనకాల బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మెడపల్లి గ్రామంలో జరిగింది.

మెడపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ కొద్ది కాలంగా నర్సంపేటలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిందని తెలియడంతో మనస్థాపానికి గురై నర్సంపేట లోని తన ఇంటి వెనుకాల ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండురోజుల రోజులుగా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసుల సూచనల మేరకు అన్ని చోట్ల వెతుకులాట కొనసాగించారు. ఈ ప్రయత్నం లో నిన్న రాత్రి తన ఇంటి వెనుకాల ఉన్న బావిలో అనుమానంతో పరిశీలించారు. అందరూ కలసి చూడగా.. మహబూబ్ అలీ శవమై కనిపించాడు. కరోనా వస్తే అయిన వాళ్లే మొహం చాటేస్తారని.. అందరూ దూరం జరుగుతారని.. సూటి పోటి మాటల గురించి భయపడి ఆవేదన చెందినట్లు కనిపించాడని.. ఎవరికీ చెప్పకుండా ఇలా శవమై కనిపించాడంటూ బంధవులు.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం కలచివేసింది.