నాలుగేండ్ల తర్వాత ఆఫర్ లెటర్లు

నాలుగేండ్ల తర్వాత ఆఫర్ లెటర్లు
  •      ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి లైన్ క్లియర్
  •     72 మందికి నేడు అపాయింట్ లెటర్లు ఇవ్వనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి లైన్ క్లియర్ అయింది. నాలుగేండ్ల కింద టీఎస్ పీఎస్సీ నుంచి రిక్రూట్ అయిన 72 మంది జూనియర్ అసిస్టెంట్ లకు గురువారం ఆర్టీసీ అధికారులు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. బస్ భవన్ కు వచ్చి ఆఫర్ లెటర్లు తీసుకోవాలని సూచించారు. త్వరలో ట్రైనింగ్ డేట్ వెల్లడిస్తామన్నారు. తమకు అపాయింట్ ఆర్డర్లు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని 2020 నుంచి హరీశ్​రావు, పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులను అభ్యర్థులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. 

కరోనా, ఆర్టీసీ నష్టాల కారణంగా వీరిని తీసుకోలేమని చెప్తూ వచ్చారు. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని, రిక్రూట్ మెంట్ బంద్ చేశామని ఆర్టీసీ అధికారులు పిటిషన్ వేశారు. దీంతో అభ్యర్థులంతా కొన్ని రోజుల కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ట్రాన్స్​పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్​ను కలిసి సమస్య వివరించారు. దీంతో వారు సానుకూలంగా స్పందిస్తూ 72 మందిని విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాలుగేండ్ల తర్వాత తమ సమస్య పరిష్కారం కావడంతో అభ్యర్థులంతా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.