హమ్మయ్య! కోడ్​తో ఊపిరి పీల్చుకుంటున్న ఆఫీసర్లు, పోలీసులు..

హమ్మయ్య! కోడ్​తో ఊపిరి పీల్చుకుంటున్న ఆఫీసర్లు, పోలీసులు..

ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో ఎమ్మెల్యేలు, లీడర్లలో టెన్షన్​పెరిగిపోతుంటే ఆఫీసర్లు మాత్రం కాస్తా రిలాక్స్ అవుతున్నారు. కొద్దిరోజులైనా ఈ లీడర్ల వేధింపులు తప్పుతాయని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆఫీసర్లు, ఉద్యోగుల పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడడడంతో కొద్ది నెలలుగా రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. 

కేటీఆర్, హరీశ్​రావుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల అఫీషియల్ ప్రోగ్రామ్​లకు అన్ని రకాల ఏర్పాట్లను ఆఫీసర్లు, ఉద్యోగులే దగ్గరుండి చేయాల్సి వచ్చింది. ఫౌండేషన్ స్టోన్స్ రెడీ చేయించడం, ఫ్లెక్సీలు కట్టించడం, డయాస్​లు రెడీ చేయడం దగ్గరి నుంచి జనసమీకరణ దాకా అన్ని ఏర్పాట్లు చూడాల్సి రావడంతో ఆఫీసర్లు పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ‘ఇంత చేసినా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి రోజూ ఏదో ఒక పని కోసం ఫోన్ చేయడం, అదేం చేశారు? ఇది ఎక్కడి దాకా వచ్చింది? అంటూ వేధించిన్రు.. కోడ్ పుణ్యమా అని ఇప్పుడు ఆ వేధింపుల నుంచి బయటపడ్డం’ అని ఓ ఆఫీసర్ ‘వెలుగు’తో చెప్పారు. 

ఇక ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు, గృహలక్ష్మి, డబుల్​బెడ్​రూం ఇండ్లు.. ఇలా అన్ని రకాల స్కీముల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత తమది కాగా, లీడర్లే పార్టీ కార్యకర్తలను, అనర్హులను ఎంపిక చేసి సంతకాల కోసం తమ దగ్గరికి వచ్చేవారని, తమకు ఇష్టం లేకున్నా మనసు చంపుకొని సంతకాలు పెట్టాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. 

ప్రత్యర్థులను, ఆఖరికి సొంత పార్టీలోని అసమ్మతి నేతలపై అక్రమ కేసులు పెట్టాలని, స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇవ్వాలంటూ రూలింగ్ పార్టీ లీడర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను భరించలేకపోయామని, ఇప్పుడు కొద్దిరోజులైనా ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుందని పోలీస్​ఆఫీసర్లు చెప్పుకుంటున్నారు. 

నిబంధనలు అతిక్రమిస్తే ఆఫీసర్లు, పోలీసులు, ఉద్యోగులపైనా చర్యలు ఉంటాయని ఈసీ మాటగా కలెక్టర్లు, పోలీస్​ఆఫీసర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. మంగళవారం కొంతమంది లీడర్లు ఎప్పట్లాగే తమ పనుల కోసం ఫోన్ చేసినా ఇదే విషయం చెప్పి తప్పించుకున్నట్లు పలువురు పోలీసులు చెప్పడం విశేషం.

- వెలుగు, వనపర్తి