
- హైదరాబాద్ కలెక్టర్, బల్దియా కమిషనర్‌పై మండిపాటు
- కోర్టు ధిక్కరణ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని వార్నింగ్
- విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసిన డివిజన్ బెంచ్
హైదరాబాద్,వెలుగు: కోర్టు ఆదేశాలను అమలు చేయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్‌పై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అధికారులు హాజరయ్యారు. ముషీరాబాద్ బాకారంలోని మెయిన్ రోడ్డు, ఇరువైపులా ఆక్రమణల తొలగింపులోని జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.స్పెషల్ పీపీ అభ్యర్థన మేరకు డిసెంబర్ 26న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
రోడ్డు ఆక్రమిస్తున్నారని పిటిషన్
ముషీరాబాద్ మెయిన్ రోడ్ నుంచి జనప్రియ అబోడ్ అపార్ట్‌మెంట్స్(వివేకానంద నగర్ కాలనీ)వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానిక శతాబ్ధి నిలయం ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొన్నేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, బల్దియా కమిషనర్,హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ముషీరాబాద్ తహశీల్దార్ తో పాటు మొత్తం 26 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఆ పిటిషన్ పై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశిస్తూ 2006లో ఆదేశాలు జారీ చేసింది. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను వెంటనే తొలగించాలని, 30 అడుగుల రోడ్డును పునరుద్ధరించాలని తీర్పు చెప్పింది.
కోర్టు ఆదేశాల ధిక్కరణ
కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు పిటిషనర్ల తరఫు న్యాయవాది పి గోవింద్ రెడ్డి కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు గత సెప్టెంబర్ 26న ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 14లోపు ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై మంగళవారం గోవింద్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారుల తరఫున స్పెషల్ పీపీ టైమ్ ఇవ్వాలని కోరారు.
ఎన్నికల సమయం కావడంతో కమిషనర్, కలెక్టర్ కోర్టుకు హాజరుకాలేక పోతున్నారని తెలిపారు. దీంతో న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బెంచ్ ముందు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్‌జారీ చేస్తామని హెచ్చరించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషనర్, కలెక్టర్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట హాజరయ్యారు.