ఆఫీసర్ల చేతివాటం..ఆస్తుల ఆన్ లైన్ కు డబ్బులు వసూలు

ఆఫీసర్ల చేతివాటం..ఆస్తుల ఆన్ లైన్ కు డబ్బులు వసూలు
  •     గద్వాల జిల్లా పూడూరులో ఆఫీసర్ల చేతివాటం
  •     80 మంది నుంచి  రూ. 2 లక్షల వరకు వసూలు

గద్వాల, వెలుగు:  ఆస్తుల ఆన్​లైన్​ కార్యక్రమం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. గుడిసెలు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఆన్​లైన్​లోకి ఎక్కించాలంటే పైసలు ఇవ్వాలంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పూడూరు గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. అనధికారిక గుడిసెను ఆన్​లైన్​చేయడానికి ఆఫీసర్లు రూ. 2,300 వసూలు చేశారు. గుడిసెకు ఇంటి పన్ను కట్టినట్లు రూ. 300కు రసీదు ఇచ్చారు. రెండు వేల రూపాయలకు ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని ఇంటికి పంపారు. ఇలా గ్రామంలో దాదాపు 80 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.  రెండు వేల నుంచి మూడు వేల వరకు వసూలు చేశారు. దాదాపు గురువారం ఒక్క రోజే ఇలా లక్షన్నర నుంచి రెండు లక్షల పైగా వసూలు చేశారంటే ఆఫీసర్లు ఎంతమేర చేతివాటం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అనధికారిక గుడిసెలు, ఇండ్ల స్థలాలు ఉన్నవారిని టార్గెట్ చేసుకుంటూ ఆఫీసర్లు, కొందరు రాజకీయ నాయకులు డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాగేందుకు ఖర్చు పెడతారు కదా

గ్రామంలో ఉన్నవారు చాలామంది తాగేందుకు పైసలు ఖర్చు పెడతారు కదా మాకు ఇస్తే ఏమవుతుందంటూ ఒక ఆఫీసరు అనడం చర్చనీయాంశమైంది. డబ్బు వసూలు చేసిన విషయం బయటపడడంతో ఆఫీసరు పైవిధంగా స్పందించారు. మరోవైపు లీడర్లు రంగంలోకి దిగారు. పన్ను ఒకటే రూ. వెయ్యి వసూలు చేయాలి కానీ రూ. 2000, రూ.3000 వరకు వసూలు చేశారు. ఈ విషయాన్ని పెద్దగా చేయకండి మీ డబ్బులు మీకిస్తామంటూ కొందరు లీడర్లు పబ్లిక్ దగ్గరకు వచ్చి ఆఫీసర్లకు వత్తాసు పలుకుతున్నారు.

రూ. 2300 కడితే.. రూ.300కు రసీదిచ్చిన్రు

మా గుడిసెన్​ఆన్​లైన్​చేస్తమంటూ రూ. 2,300 తీసుకున్నరు. కానీ రసీదు మాత్రం రూ. 300కు ఇచ్చిన్రని గ్రామానికి చెందిన లక్ష్మి అనే బాధితురాలు తెలిపారు. అదేవిధంగా మునెమ్మ అనే మహిళకు కూడా రూ. 2300 చెల్లిస్తే 300 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారని వాపోయారు.

ఫ్రీగా ఆన్లైన్ చేయాలి

పంచాయతీలలో ఆన్​లైన్ చేసేందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. ఫ్రీగా ఆన్​లైన్​ చేయాలి. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.

‑ కృష్ణ, డీపీవో, జోగులాంబ గద్వాల జిల్లా