అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేస్తున్నరు : బండి ‌‌‌‌‌‌‌‌సంజయ్

అధికారులు ఇప్పుడు  స్వేచ్ఛగా పని చేస్తున్నరు : బండి ‌‌‌‌‌‌‌‌సంజయ్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో అధికారులు నిర్బంధాల మధ్య పని చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి ‌‌‌‌‌‌‌‌సంజయ్ అన్నారు. ‘‘ఆనాడు కేంద్ర నిధులతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిద్దామంటే అధికారులను రానిచ్చేవారుకాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అధికారులు స్వేచ్ఛగా పని చేస్తున్నారు” అని చెప్పారు. బుధవారం కరీంనగర్​లోని అంబేద్కర్ స్టేడియంలో ఏడీఐపీ, ఆర్వీవై పథకం కింద కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ట్రై సైకిళ్లను జిల్లాలోని 731 మంది దివ్యాంగులకు సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘కరీంనగర్ జిల్లాలో దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, శిశు సంక్షేమం కోసం గత మూడేండ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసింది. ఇవేగాక గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి పనుల నిధులన్నీ కేంద్రానివే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేది. నేనే మూడుసార్లు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చింది. నిజాయతీ, నిబద్ధతతో పని చేస్తున్నారు. కేంద్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

గతంలో అధికారులు కేంద్రం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేవారుకాదు. బీఆర్ఎస్ పాలనలో బెదిరింపుల వల్ల కేంద్రం దివ్యాంగులకు అందిస్తున్న ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించలేకపోయారు. ‌‌‌‌‌‌‌‌నిర్బంధాల మధ్య అధికారులు పని చేయడంతో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడా బాధ లేదు. అధికారులు స్వేచ్ఛగా బయటకొచ్చి పని చేస్తున్నారు. వాళ్లకు హ్యాట్సాఫ్” అని అన్నారు. భవిష్యత్తులోనూ అధికారులను స్వేచ్ఛగా పని చేయనివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. లేదంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్​కు పడుతుందన్నారు.