కోర్టుకు వెళ్లారని రోడ్లు మూసేశారు

కోర్టుకు వెళ్లారని  రోడ్లు మూసేశారు

సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో న్యాయమైన పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఆఫీసర్లు పొమ్మనలేక పొగబెడుతున్నారు. కోర్టుకు వెళ్లి తమ పనులకు అడ్డుతగులుతున్నారని భావించిన ఆఫీసర్లు.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, తుర్క బంజేరు పల్లి గ్రామాలకు వెళ్లే రోడ్లకు అడ్డంగా మట్టి కుప్పలు పోసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే కోర్టు నుంచి మొట్టి కాయలు పడ్తాయని, అందుకే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

500 కుటుంబాల పోరాటం

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని 9 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం నిర్వాసితులకు ఎకరానికి రూ.6 నుంచి రూ.7 లక్షల దాకా పరిహారం అందించింది. చాలా నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వాళ్లకు రూ.5 లక్షల పరిహారం అందలేదు. ఒంటరి మహిళలకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్‌లకు పరిహారం విషయాన్ని కూడా ప్రభుత్వం తేల్చలేదు. దీంతో న్యాయమైన పరిహారం కోసం చాలా మంది నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండగానే ఆఫీసర్లు గ్రామాల్లో కూల్చివేతలు స్టార్ట్ చేయగా.. నిర్వాసితులు మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. దీంతో జూన్ 30 దాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో గజ్వేల్ దగ్గర ఏర్పాటు చేసిన ముట్రాజ్‌పల్లి పునరావాస కేంద్రానికి వెళ్లకుండా వేములఘాట్లో 150, ఏటిగడ్డ కిష్టాపూర్లో 250, తుర్క బంజేరుపల్లిలో 100 కుటుంబాలు తమ ఇండ్లలోనే ఉంటున్నాయి.

అడ్డంగా మట్టిపోసి..

పరిహారం కోసం హైకోర్టుకు వెళ్లి పనులు అడ్డుకుంటున్నారని నిర్వాసితులపై కక్ష కట్టిన ఆఫీసర్లు.. వాళ్లకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. నిర్వాసితులు నిత్యావసరాల కోసం సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలకు వెళ్తుంటారు. ఊళ్లకు వచ్చే ఆటోలను ఇప్పటికే బంద్ చేయించారు. దీంతో నిర్వాసితులంతా బైకులు, ట్రాక్టర్లలో వెళ్లి వస్తున్నారు. ఎలాగైనా ఈ రాకపోకలను అడ్డుకుంటే నిర్వాసితులు వెళ్లిపోతారని భావిస్తున్న ఆఫీసర్లు.. సిద్దిపేట, గజ్వేల్ నుంచి ఈ మూడు గ్రామాలకు వెళ్లే రోడ్లను మూసివేయిస్తున్నారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ద్వారా రోడ్లకు అడ్డంగా మట్టి కుప్పలు పోయించారు. రాత్రికి రాత్రే దారులను మూసేసి తమ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఇదేమని అడిగితే వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసివెళ్లాలని కాంట్రాక్టర్లతో బెదిరిస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్లే తోవలో ఎత్తైన కట్ట ప్రాంతం ఉండగా, దానిపై మట్టి పోసి మరీ ఎత్తు చేశారు. దీంతో వాహనాలు ఎక్కడం లేదు. ట్రాక్టర్లు కూడా ఎక్కకపోవడంతో కాలినడకన వెళ్తున్నారు. మిగిలిన గ్రామాల్లోనూ మట్టికుప్పల ద్వారా రాకపోకలను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కరోనా పరీక్షలు చేయట్లేదని, టీకాలు కూడా వేయట్లేదని, ఏటిగడ్డ కిష్టాపూర్లో ఇప్పటికే ఇద్దరు చనిపోయారని, ఇలాంటి టైంలో హాస్పిటల్‌కు వెళ్లకుండా రోడ్లు మూయడం తమ ప్రాణాలతో ఆడుకోవడమేనని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అదీగాక ఉన్నఫలంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడికి వెళ్లాలని, గజ్వేల్లో తమకు సొంత ఇండ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు పెడుతున్రు

మల్లన్న సాగర్ నిర్వాసితులను ఇబ్బందులు పెడుతున్రు. హైకోర్టు తీర్పు ప్రకారం జూన్ 30 వరకు ఇండ్ల కూల్చివేతలు నిలిపివేయాలి. నిర్వాసితులకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడంతో మాపై కక్ష కట్టిన్రు. గ్రామాలకు వేళ్లే రోడ్లను మూసేస్తే ఆపద సమయంలో మా ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ ఇస్తరు. ఆఫీసర్లు నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నరు. ఇది నిజంగా అన్యాయం, అమానవీయం.
- హయతుద్దీన్, వేములఘాట్

ఆఫీసర్లూ.. మీకిది తగదు

మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు వెళ్లే రోడ్లను మూసేయడం తగదు. న్యాయం కోసం పోరాడుతున్న నిర్వాసితులను ఇబ్బంది పెట్టడమే ఆఫీసర్ల లక్ష్యంగా కనిపిస్తోంది. కోర్టులో పోరాటం చేస్తున్న వారు, పరిహారాలు పూర్తిగా అందనివాళ్లే ఇంకా ముంపు గ్రామాల్లో ఉన్నరు. వీరిని ఎలాగైనా పంపించాలనే రోడ్లను మూసేసి ఇబ్బందులు పెడుతున్నరు. 
- ఎస్.అశోక్, ఏటిగడ్డ కిష్టాపూర్