మహాజాతరకు ముస్తాబైన మేడారం.. జాతరకు పోతున్న భక్తులకు ముఖ్య గమనిక

మహాజాతరకు ముస్తాబైన మేడారం.. జాతరకు పోతున్న భక్తులకు ముఖ్య గమనిక
  • రూ.251 కోట్లతో సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ 
  • విద్యుద్దీపాలతో జిగేల్‌‌‌‌మంటున్న తల్లుల గద్దెల ప్రాంగణం
  • ఈ సారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
  • రాష్ట్ర నలుమూలల నుంచి 4 వేల ఆర్టీసీ బస్సులు
  • 15 వేల మంది పోలీసులతో బందోబస్తు

వరంగల్‍(మేడారం), వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళా సమ్మక్క–సారలమ్మ జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28న సారలమ్మ రాక, 29న సమ్మక్క ఆగమనం, 30న గద్దెలపై ఇరువురు తల్లులకు మొక్కుల చెల్లింపు ఉంటాయి. 

అనంతరం 31న తల్లులిద్దరి వన ప్రవేశంతో మేడారం జాతర అధికారికంగా ముగుస్తుంది. ఈ సారి జాతరకు దాదాపు 2 కోట్లకు పైగా  భక్తులు తరలివచ్చే అవకాశం ఉందనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.  భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర నలుమూలలనుంచి 4 వేల ఆర్టీసీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ,  మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తోంది.15 వేల మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సారక్క రాకతో జాతరలో తొలి ఘట్టం 
మేడారం జాతరలో ఈ నెల 28 (బుధవారం)న తొలి ఘట్టం జరగనుంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద పూజల అనంతరం ప్రధాన పూజారి కక్కె సారయ్య పసుపు, కుంకుమ భరిణితో కూడిన  అమ్మవారి ప్రతిరూపం వెదురుబుట్ట (మొంటె) తీసుకుని కాలినడకన మేడారానికి బయలుదేరుతారు. జంపన్నవాగు మీదుగా మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు.

ఇక్కడే సమ్మక్క, పగిడిద్దరాజుల పెండ్లి తంతు నిర్వహిస్తారు. ఆపై సారలమ్మను ప్రధాన గద్దెపై కొలువుదీరుస్తారు. మహబూబాబాద్‍ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో కొలువుండే సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువైన గోవిందరాజును సైతం బుధవారమే మేడారంలోని ప్రధాన గద్దెల వద్దకు చేర్చడంతో జాతర మొదలవుతుంది.

రెండోరోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం
కోట్లాది మంది భక్తులు పులకరించే అపూర్వఘట్టం 29 (గురువారం)న సాయంత్రం కండ్ల ముందర సాక్షాత్కరిస్తుంది. సమ్మక్క తల్లి కొలువుండే చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉండే తల్లిని గిరిజన పూజారులు వనం నుంచి జనంలోకి తీసుకువస్తారు. గుట్ట వద్ద ములుగు ఎస్పీ గౌరవ సంకేతంగా గాలిలో 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. 

దారి పొడవునా జనాలు రంగురంగుల ముగ్గులు వేసి తల్లికి జేజేలు పలుకుతారు. జై సమ్మక్క తల్లి నినాదాలు.. శివసత్తుల పూనకాలతో లక్షలాది మంది భక్తులు మైమరిచిపోతారు. దాదాపు 5‌ నుంచి 6 గంటలపాటు మహా ఘట్టం కొనసాగనుంది. ర్యాలీగా వచ్చి సమ్మక్కతల్లిని గద్దెమీదకు చేర్చుతారు.

మూడో రోజు మొక్కులు .. నాలుగో రోజు వన ప్రవేశం
మూడోరోజు 30 (శుక్రవారం) సమ్మక్క–సారక్క తల్లులిద్దరూ ఒకే చోట గద్దెలపై కొలువుదీరి ఉంటారు.  దీంతో భక్తులు  మొక్కులు చెల్లించుకోడానికి ఎన్నో ప్రయాసలు పడి దర్శనం కోసం వస్తుంటారు. 31 (శనివారం) మధ్యాహ్నం తర్వాత తల్లులిద్దరూ తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. 

ఏఐ డ్రోన్లు, 13 వేల మందితో హైసెక్యూరిటీ.. 
మేడారంలో టీజీ క్వెస్ట్  అత్యాధునిక డ్రోన్  వ్యవస్థతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. మేడారం–2.0లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణకు, ఎవరైనా మిస్సింగ్​ అయితే వెంటనే తెలిసేలా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డ్రోన్ల ద్వారా 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని 15 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు.


31 క్యాంపులు ఏర్పాటు చేసి డీఎస్పీ, సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో ఒక్కో క్యాంపులో 500 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. జియో ట్యాగ్  బేస్డ్​ పద్ధతి ద్వారా మిస్సింగ్​ పర్సన్లను ట్రాకింగ్​ చేయనున్నారు. వృద్ధులు, చిన్నారులకు క్యూఆర్​ కోడ్ ఉండే జియో ట్యాగ్‌లు అమర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

4 వేల బస్సులు.. 1,418 ఎకరాల్లో పార్కింగ్‍ 
మేడారం మహా జాతర కోసం ఈ సారి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 4 వేల బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. జాతరలో భాగంగా మేడారం చుట్టూ భక్తులకు ట్రాఫిక్  కష్టాలు రాకుండా 1,418 ఎకరాల విస్తీర్ణంలో 43 చోట్ల పార్కింగ్​ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ కంట్రోల్‍ కోసం మేడారంలో వన్  వే పెడుతున్నారు.

భక్తులే మా వీఐపీలు: మంత్రి సీతక్క
ములుగు: మేడారం సమ్మక్కసారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులే తమకు వీఐపీలని, వారికి సర్వదర్శనం ఇచ్చేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ‘వీఐపీ, వీవీఐపీ పాసులను పలహారంలా పంచి పెట్టలేమని సాధారణ భక్తులే మా వీఐపీలు’ అని పేర్కొన్నారు. సోమవారం ములుగు క్యాంప్​ ఆఫీస్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

భక్తులంతా కుటుంబ సమేతంగా తరలివచ్చి తల్లుల దర్శనం చేసుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు. క్యూలైన్లలో వచ్చి తల్లులను దర్శనం చేసుకోవాలని, భక్తులందరికీ శీఘ్ర దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొందరి అత్యుత్సాహంతో మిగిలిన భక్తులు ఇబ్బందులు పడొద్దన్నారు. క్యూలైన్లను డిస్టర్బ్​ చేయకుండా నిర్వాహకులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని కోరారు.

ప్రతి భక్తుడు స్వీయ నియంత్రణతో వ్యవహరించాలని విజ్క్షప్తి చేశారు. వాహనదారులు ఓవర్​ స్పీడ్, ఓవర్​ టేక్​ చేయొద్దని, ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, జాతరకు వచ్చే ముఖ్యులు కూడా సహకరించాలని కోరారు. 

నేటి నుంచి గద్దెలపైకి భక్తుల అనుమతి నిలిపి వేసి క్యూలైన్ల ద్వారా దర్శనం చేయిస్తామన్నారు. అనంతరం ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద మంత్రి మొక్కులు చెల్లించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిని పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.