హైదరాబాద్, వెలుగు: టీఎస్‌బీపాస్ అప్లికేషన్లను పరిశీలించి, ఆన్‌లైన్‌లో అనుమతులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పది మంది అధికారులకు పెనాల్టీ విధిస్తూ రాష్ట్ర సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు అధికారులకు రూ.10 వేల చొప్పున, మిగిలిన ఏడుగురికి రూ.5 వేల చొప్పున జీతాల్లో కోత పెట్టనున్నట్టు వెల్లడించింది. టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా చేసుకున్న అప్లికేషన్లను 15 రోజుల్లోగా పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మునిసిపల్ టౌన్ ప్లానింగ్‌తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు ఈ అప్లికేషన్‌లు పరిశీలించి వారివారి డిపార్ట్‌మెంట్ల నుంచి క్లియరెన్స్ ఇస్తారు. నిర్దేశిత గడువులోగా అప్లికేషన్లను పరిశీలించి పర్మిషన్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే కారణంతో పెనాల్టీ విధించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఇరిగేషన్ ఏఈ పి. శ్రీకాంత్, పీర్జాదిగూడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాజీవ్ రెడ్డి, ఆదిలాబాద్ ఇరిగేషన్ ఏఈ పి.వెంకటేశంలకు రూ.10 వేల చొప్పున, మహబూబాబాద్ ఆర్‌ఐ నాగభవాని, ఖమ్మం టీపీఎస్ నరేశ్ కుమార్, గ్రేటర్ వరంగల్ ఇరిగేషన్ ఏఈ సంతోశ్, మీర్‌పేట టీపీఎస్ దేవానంద్, మక్తల్ ఆర్‌ఐ కాయప్ప, కరీంనగర్ టీపీఎస్ శ్రీహరి, తూంకుట రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ డి.కుమార్‌కు రూ.5 వేల చొప్పున పెనాల్టీ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.
