ఆ ఇండ్ల  రికార్డుల్లేవ్​

ఆ ఇండ్ల  రికార్డుల్లేవ్​
  • ఆన్​లైన్​లో నమోదు చేయని దుబ్బాక మున్సిపాలిటీ
  • 1772 ఇండ్లు, ప్లాట్లు రికార్డుల్లో లేవ్​..
  • డాక్యుమెంట్లు లేవని ఆన్​లైన్​చేయని ఆఫీసర్లు
  • మూడేండ్లుగా మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువు 

‘దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని దుంపలపల్లిలో  25 ఏండ్ల క్రితం పేదలకు 80 ప్లాట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 30 మంది ఇండ్లు కట్టుకోగా.. మరో 50 ఖాళీ ప్లాట్లుగానే ఉన్నాయి. మూడేండ్ల క్రితం దుంపలపల్లి  గ్రామాన్ని దుబ్బాక మున్సిపాలిటీలో విలీనం చేసినప్పుడు ఈ 80 మంది  వద్ద సరైన డాక్యుమెంట్లు లేవని మున్సిపాలిటీ రికార్డులకెక్కియ్యలే.. ఇప్పుడు వారి ఖాళీ ప్లాట్లలో ఇండ్లు కట్టుకుందామంటే పర్మిషన్లు, బ్యాంక్​లోన్లు ఇవ్వకపోగా.. కట్టిన ఇండ్లు అమ్ముదామంటే రిజిస్ట్రేషన్​కూడా చేస్తలేరు’.   ఈ సమస్య ఒక్క దుంపలపల్లి పరిధిలోని 80 మందిదే  కాదు.. మున్సిపాలిటీలో 1,772 మంది యజమానులు కూడా ఇదే సమస్యతో  ఇబ్బందులు పడుతున్నారు. 
సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: దుబ్బాక మున్సిపాలిటీలో ఇండ్లు, ప్లాట్ల యజమానుల పరిస్థితి ‘సూసుకొని మురువ.. చెప్పుకొని ఏడువ’  అన్నట్లు తయారైంది. మూడేండ్ల క్రితం.. దుబ్బాక గ్రామ పంచాయతీ తో పాటు మరో 6 గ్రామాలను కలిపి  మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.  మున్సిపాలిటీలో సర్వే చేసి మొత్తం 7,219  ఇండ్లు, ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు డాక్యుమెంట్ల ఆధారంగా ఆన్​లైన్ లో ఎంట్రీ చేశారు. అందులో  సరైన పేపర్లు లేని 1,772  ఇండ్లు,  ప్లాట్ల వివరాలు  ఎంట్రీ చేయలేదు.  ప్రస్తుతం ఆన్​లైన్​లో 5,447  ఇండ్లు, ప్లాట్లు మాత్రమే ఉన్నట్లు చూపిస్తోంది.  
సాదాబైనామాలు చూపినా పట్టించుకోలే..
గ్రామ పంచాయతీ రికార్డుల్లో  ఉండి అప్పుడు ఇంటి నెంబర్ల  ఆధారంగా ట్యాక్స్​లు కట్టేవారు. డాక్యుమెంట్లు, పేపర్లు ఎవరూ అడగకపోవడంతో  వారసత్వంగా వచ్చిన ఇండ్లు, స్థలాల క్రయ విక్రయాలు  సాదాబైనామాలతోనే జరిగేవి. ఆన్ లైన్ ప్రక్రియ నిర్వహించే టప్పుడు యజమానులు సాదా బైనామాలు చూపించినా.. సరైన డాక్యుమెంట్లు లేవనే ఆఫీసర్లు ఆన్​లైన్లో ఎంట్రీ చేయలేదు.  దీంతో మున్సిపాలిటీలో ఇండ్లు, ప్లాట్లు ఉన్నా.. ఆన్ లైన్ లో చూపించకపోవడంతో వాటిపై ఎలాంటి హక్కు సర్టిఫికెట్లు  పొందలేక   యజమానిగా కొనసాగలేని  పరిస్థితి ఏర్పడింది.
టెక్నికల్​గా రైట్స్​లేని ఓనర్లు
దశాబ్ధాలుగా వారసత్వంగా వచ్చిన జాగలకు, ఇండ్లకు ఎలాంటి  డాక్యుమెంట్లు లేకుండా  ఉంటున్న తమకు యాజమాన్య హక్కులు  లేకపోవడంతో  యజమానులు ఆందోళన చెందుతున్నారు. మూడేండ్ల క్రితం ఆన్​లైన్​ కోసం సర్వే చేసిన అధికారులు ఈ సమస్యలను అప్పుడే పరిష్కరిస్తే  సమస్య ఇంతదాకా  వచ్చేది కాదని వాపోతున్నారు. మూడేండ్లుగా ఆన్​లైన్​లో ఎక్కించాలని తిరుగుతున్నా.. రేపు మాపు అంటూ తిప్పుతున్నారే తప్పా.. ఎవరూ పట్టించుకుంట లేరని వాపోతున్నారు.   ఏదైనా ఆపదొచ్చి లోన్​ తెచ్చుకుందామన్నా.. అమ్ముకుందామన్నా కష్టకాలమొచ్చిందని యజమానులు వాపోతున్నారు. 

 మస్తు బాధలు పడుతున్నం
మున్సిపాల్టీలో ఇల్లు జాగ ఉన్నా.. ఆఫీస్​రికార్డుల్లో లేక మస్తు బాధలు పడతున్నం. ఇల్లు కట్టుకుందామని బ్యాంకు లోన్ కోసం వెళ్తే మున్సిపాలిటీ నుంచి సర్టిఫికేట్ తేవాలంటున్రు. మున్సిపాలిటీ వాళ్లను అడిగితే ఆన్ లైన్ లో మీ పేరు లేదు.. సర్టిఫికేట్​ఇవ్వడం కుదరదంటున్రు. మూడేండ్లుగా ఇదే బాధతో మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంట లేరు.                                                                                                         - జంగిటి స్వరూప, దుంపలపల్లి

సరైన డాక్యుమెంట్లు లేక  ఎంట్రీ చేయలే..
ఇండ్లు, జాగలకు సరైన డాక్యుమెంట్లు లేక ఆన్​లైన్​లో ఎంట్రీ చేయని మాట వాస్తవమే. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాం.  ప్రభుత్వం నుంచి పర్మిషన్​రాగానే 1,772 ఇండ్లను ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తాం. 
                                                                                                                                                                                            - గణేశ్​రెడ్డి, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక

ఆన్​లైన్​లో నమోదవనివి
మున్సిపాల్టీ పరిధిలో ఆన్ లైన్ లో నమోదవని ఇండ్లు, ఖాళీ స్థలాలు దుబ్బాకలో 847,  మల్లాయపల్లిలో 18, చెల్లాపూర్ 6, దుంపలపల్లి 237, చేర్వాపూర్ 70, ధర్మాజీపేట 275, లచ్చపేట 319  ఉన్నాయి.