ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ స్పీడప్... స్పెషల్ ఫోకస్ పెట్టిన అధికారులు

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ స్పీడప్... స్పెషల్ ఫోకస్ పెట్టిన అధికారులు
  • టెక్నికల్​ సమస్యలు తీరాయంటున్న హెచ్ఎండీఏ 
  • కమిషనర్ ఆదేశాలతో పెండింగ్​ఫైల్స్​ క్లియర్​ చేస్తున్న ఆఫీసర్లు  

హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులను త్వరితగతిన క్లియర్​చేయాలని కమిషనర్​సర్ఫరాజ్​అహ్మద్​ఆదేశాలతో అధికారులంతా ఆ పనిలో పడ్డారు. 2022లో బీఆర్ఎస్​ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కానీ, కొన్ని సమస్యలతో వాటిని పెండింగ్ లో  పెట్టిన అధికారులు ఇప్పుడు క్లియరెన్స్​పై దృష్టి పెట్టారు. 

ఇంతకాలం ఒక ప్లానింగ్ అధికారి పరిధిలో ఒక్కరికే వెబ్ సైట్​ లో లాగిన్ అయ్యే అవకాశం ఉండడం వల్ల పరిశీలనలో తీవ్ర జాప్యం జరిగిందని,  ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు. ఎల్ఆర్ఎస్​ కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలించి వెంటనే  అవసరమైన సొమ్ము వసూలు చేసి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఘట్​కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్ పల్లి జోన్ల పరిధి నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. 

రెండేండ్లలో 2.23 లక్షల దరఖాస్తులు

ఎల్ఆర్ఎస్​స్కీమ్​ప్రకటించిన తర్వాత ఎప్పటికప్పుడు దరఖాస్తులను క్లియరెన్స్​చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. గత రెండేండ్లలో 2.23 లక్షల దరఖాస్తులు రాగా, 62 వేల మందికి అవసరమైన ఫీజులు చెల్లించాల్సిందిగా సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. ఇందులో 30 వేల దరఖాస్తులను ఈ ఏడాదే అప్రూవ్​చేశామన్నారు. అలాగే, మరో 27, 479 షార్ట్​లిస్ట్​ చేశామని చెప్పారు. ప్రస్తుతం 1.95,491 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయంటున్నారు. త్వరలోనే వీటిని కూడా క్లియర్ చేయనున్నట్టు చెప్పారు.   

ఎల్ఆర్ఎస్​ఎవరికి వర్తిస్తుందంటే...

 2020కి ముందు వేసిన అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారే తాజా మార్గదర్శకాల ప్రకారం రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారే ఎల్ఆర్ఎస్​ కు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, అక్రమ లేఅవుట్లలో కనీసం 10శాతం ప్లాట్లు విక్రయించి ఉంటేనే మిగిలిన ప్లాట్లను క్రమబద్దీకరించడానికి అవకాశం ఉంటుంది. అయితే,10శాతం విక్రయాలు జరగని లేఅవుట్లకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంటున్నారు.

వీటిని పెండింగ్​లో ఉంచినట్టు చెప్పారు. ఆలయ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు ఉంటే.. వాటిని గతంలో రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ క్రమబద్ధీకరణకు అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి సమస్యలున్నా ప్లాట్లు, లేఅవుట్లను ఫీల్డ్​లెవెల్​లో పరిశీలించాల్సి ఉంటుందని, రూల్స్​ప్రకారం అన్ని అప్లికేషన్లను పరిశీలించిన తర్వాతనే క్రమబద్ధీకరణ ప్రాసెస్ చేస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.