సీఎంవో ఆదేశాలు..దొడ్డిదారిన టీచర్ల ట్రాన్స్ఫర్లు

సీఎంవో ఆదేశాలు..దొడ్డిదారిన టీచర్ల ట్రాన్స్ఫర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల జనరల్ ట్రాన్స్​ఫర్స్​కు సవాలక్ష అడ్డంకులు పెట్టే సర్కారు.. దొడ్డిదారిన పైరవీ బదిలీలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. సీఎంవో నుంచే ఆదేశాలు వస్తుండటంతో విద్యాశాఖ అధికారులు నిబంధనలన్నీ పక్కన పెట్టి ట్రాన్స్​ఫర్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ముగ్గురు టీచర్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు. దీంట్లో టీఆర్ఎస్​ అనుబంధ టీచర్ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఉత్తర్వుల కాపీ బయటకు రావడంతో టీచర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ టీచర్ యూనియన్ ప్రెసిడెంట్​ను.. రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్​ మండలం ఎంపీపీఎస్ ఎన్టీఆర్​నగర్​కు బదిలీ చేశారు.

ఆర్డర్​ కాపీలో జీవో 317 ప్రకారం అంటూ పేర్కొనడంపై టీచర్లు మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ హైస్కూల్​లో పనిచేసే మహిళా టీచర్​ను, రంగారెడ్డి జిల్లా మాదాపూర్​కు బదిలీ చేశారు. మరో టీచర్​నూ కోర్టు పేరు చెప్పి బదిలీ చేసినట్టు టీచర్లు చెప్తున్నారు. అయితే ఇవన్నీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​కు సంబంధం లేకుండానే, నేరుగా సీఎంవో, ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు వస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను బ్లాక్ చేయడం, కోర్టు కేసులను, స్పెషల్ కేటగిరీ అప్పీళ్లను పక్కన పెట్టిన సర్కారు, దొడ్డిదారిన బదిలీలు చేయడంపై టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. బదిలీలను వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్​, ఎస్టీయూ, టీఆర్​టీఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.