అనుమతిలేని ప్లే స్కూల్స్ మీద అధికారుల ఫోకస్

అనుమతిలేని ప్లే స్కూల్స్ మీద అధికారుల ఫోకస్
  • గుర్తింపు లేని ప్రీ ప్రైమరీ, ప్లే స్కూళ్లపై  రాష్ట్రవ్యాప్తంగా ట్రస్మా సర్వే
  • ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ
  • రద్దు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులకు లెటర్లు

హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా నడుస్తున్న ప్రీ ప్రైమరీ, ప్లే స్కూల్స్ మీద అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ఆయా స్కూళ్లను గుర్తించి నోటీసులిచ్చి రద్దు చేస్తున్నారు. సిటీ వ్యాప్తంగా వేలసంఖ్యలో ప్రీ ప్రైమరీ, ప్లే స్కూళ్లున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం ప్రభుత్వ అనుమతి లేకుండా, రూల్స్ పాటించకుండా నడుస్తున్నవే ఉన్నాయి. ఈ స్కూళ్లలో ఏడాదికి రూ. 30 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. గుర్తింపు లేని స్కూళ్లలో పిల్లలు చదవడంతో  పై క్లాసుల కోసం స్కూల్ మారినప్పుడు స్టడీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు తెలిపారు. పర్మిషన్ లేకపోయినా అన్ని హంగులతో పేరెంట్స్ ను  ఆకట్టుకునే విధంగా స్కూళ్లను ఏర్పాటు చేసి పిల్లల విషయంలో చాలా మేనేజ్ మెంట్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటాయని ఆయన చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లను మూసివేయాలనే ఉద్దేశంతో 6 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ట్రస్మా సర్వే చేపట్టిందన్నారు. ఇందులో దాదాపు 15 వందల స్కూళ్లు అనుమతి లేకుండా నడుస్తున్నాయని శేఖర్ రావు అన్నారు. వాటిలో వెయ్యి స్కూళ్లు సిటీలోనే ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు. ఈ స్కూళ్లను మూసివేయాల్సిందిగా డీఈవో, ఎంఈవోలకు లెటర్లు రాస్తున్నామన్నారు. 

లాక్ డౌన్ టైమ్​లో 40 శాతం స్కూళ్ల క్లోజ్

లాక్ డౌన్ కు ముందు రాష్ట్రవ్యాప్తంగా 1,750కి పైగా ప్లే స్కూళ్లు ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,600 వరకు ఉన్నాయి. వీటిలో లాక్ డౌన్ టైమ్ లో దాదాపు 40 శాతం స్కూళ్లు పూర్తిగా మూతపడ్డాయి. కాగా మిగతా స్కూళ్లలో అధికశాతం స్కూళ్లు ప్రభుత్వ అనుమతి లేకుండానే కొనసాగుతున్నామని ట్రస్మా ఆరోపిస్తుంది. పేరెంట్స్, పిల్లలను ఆకట్టుకునేందుకు ప్లే ఎక్విప్ మెంట్స్, యానిమేటెడ్ వీడియోలు చూపించడం, ఫన్ యాక్టివిటీస్ తో ఈ స్కూళ్లను రన్ చేస్తుంటారు.  ప్లే వే మెథడ్​తో ఇక్కడ స్టడీస్ సాగుతాయి. కొన్ని స్కూళ్లలో సెకండ్, థర్డ్ క్లాస్ వరకు సైతం స్టడీస్ ఇలాగే ఉంటాయి. ఈ స్కూళ్లలో బ్రాండ్ నేమ్, సౌకర్యాలను బట్టి ఫీజులు రూ. లక్షల్లో ఉంటాయి. ఎంతో ఆర్భాటంగా, ఆకట్టుకునేలా ఉండే ఈ స్కూళ్లను చూసి వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండానే చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను చేర్పిస్తుంటారు. అయితే ఆయా స్కూళ్లలో చదివిన తర్వాత పై క్లాసుల కోసం స్కూల్ మారే టైమ్ లో స్టడీ సర్టిఫికెట్ పనిచేయక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ట్రస్మా చెప్తోంది.

చిన్నారులకు ఏదైనా జరిగితే..

ప్రభుత్వ పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఈ ప్రీ ప్రైమరీ, ప్లే స్కూళ్లలో ఎలాంటి రూల్స్ ఉండవని ట్రస్మా సభ్యులు అంటున్నారు. సొంత బ్రాండ్‌లతో ఏర్పాటుచేస్తున్న ఈ స్కూళ్లకు గుర్తింపులేకపోయినా లక్షల్లో ఫీజులు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ స్కూళ్లలో చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగినా మేనేజ్ మెంట్ బాధ్యత వహించదని చెప్తున్నారు. ఇలాంటి స్కూళ్లను గుర్తించి వీలైనంత త్వరగా వాటిని మూసివేయాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. తమకు ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆయా స్కూళ్లకు నోటీసులు ఇచ్చి తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. పర్మిషన్ లేని స్కూళ్లను మూసివేయిస్తున్నామన్నారు.

నోటిసులిస్తున్నాం..

సికింద్రాబాద్, ముషీరాబాద్​లో నాలుగైదు స్కూళ్ల పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని ఇటీవల ఫిర్యాదు వచ్చింది. వెంటనే విద్యాశాఖ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి నోటీసులిచ్చారు. ఇలాంటి స్కూళ్ల మీద  ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. సిటీ వ్యాప్తంగా దాదాపు వెయ్యి స్కూళ్లు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయనేది అవాస్తవం. అలాంటి వివరాలతో మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ మా దృష్టికి వస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం.
‌‌- రోహిణి, డీఈవో, హైదరాబాద్

పేరెంట్స్​ను మోసం చేస్తున్నరు

ప్రతి స్కూల్ కు ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి. రూల్స్ ప్రకారం నడవాలి. కానీ చాలా స్కూళ్లు ఇష్టానుసారంగా గుర్తింపులేకుండా నడుస్తున్నాయి. వాటిలో ఎంతో మంది పిల్లలు చదువుతున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్ దెబ్బ తింటుంది. అందుకే అలాంటి స్కూళ్లను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయంపై రెండు, మూడ్రోజుల్లో హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నాం.
- యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ట్రస్మా