డొక్కు బస్సులు డ్యామేజైతే ఖర్చులన్నీ డ్రైవర్లే భరించాలట! 

డొక్కు బస్సులు డ్యామేజైతే ఖర్చులన్నీ డ్రైవర్లే భరించాలట! 
  • డ్యామేజీ ఖర్చులు సాలరీల​ నుంచి రికవరీ
  • మంచిర్యాల డిపో ఆఫీసర్ల తీరుపై కార్మికుల నిరసన

మంచిర్యాల, వెలుగు:  అరిగిన టైర్లు..  పగిలిన అద్దాలు..  చిరిగిన సీట్లు..  తిరగని స్టీరింగ్​..  కదలని గేర్లు..  ఆర్టీసీలోని డొక్కు బస్సుల పరిస్థితి ఇదీ. కొన్ని బస్సులైతే ఎక్కడ ఆగిపోతాయో అనే ఆందోళన డ్రైవర్లను వెంటాడుతోంది. ఈ బస్సులను నడపాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. వీటికి ఏదైనా డ్యామేజీ అయినా, యాక్సిడెంట్​ జరిగినా, సాంకేతిక లోపం తలెత్తినా.. ప్రతి దానికి డ్రైవర్లను బాధ్యులను చేస్తున్నారు. చార్జిషీట్లు, షోకాజ్​ నోటీసులు ఇచ్చి ఇంక్రిమెంట్లు నిలిపివేస్తున్నారని, డ్యామేజీ ఖర్చులను  జీతాల నుంచి రికవరీ చేస్తున్నారని వాపోతున్నారు. 

మంచిర్యాల డిపోలో 84 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇందులో చాలా బస్సులు నిర్దేశించిన కిలోమీటర్లకు అటూ ఇటుగా తిరిగాయి. పాత బస్సులకే పూతలుపెట్టి  నడుపుతూ సరిగా మెయింటనెన్స్​ చేయకపోవడం వల్ల డ్యామేజీలు అవుతున్నాయి. ఎయిర్​ వచ్చి టైర్లు, గ్లాసుల పగిలినా, హెడ్​లైట్లు, సైడ్​ మిర్రర్లు దెబ్బతిన్నా, బాడీకి గీతలు పడ్డా డ్రైవర్లనే బాధ్యులను చేస్తున్నారు. ఏ చిన్న డ్యామేజీ జరిగినా చార్జిషీట్లు, షోకాజ్​ నోటీసులు జారీ చేస్తున్నారు. డ్యామేజీని సరి చేయడానికి అయిన ఖర్చులను డ్రైవర్ల జీతాల్లో కోత పెడుతున్నారు. అసలే చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఫస్ట్​కు రావాల్సిన జీతాలు పదో తారీఖు దాటినా రావడం లేదని,  మరోవైపు డ్యామేజీల పేరుతో జీతాల్లో కోతలు పెడుతున్నారని వాపోతున్నారు. అత్యవసరం అయినా, అనారోగ్యంతో ఉన్నా లీవ్​లు ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారని వాపోతున్నారు. ఒకవేళ డ్యూటీకి రాకుంటే చార్జిషీట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల డిపోలో డ్రైవర్లు, కండక్టర్లకు కలిపి సుమారు 325 మందికి చార్జిషీట్లు, షోకాజ్​ నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఒక్కో డ్రైవర్​కు రెండు మూడుసార్లు కూడా చార్జిషీట్లు ఇచ్చారు. ఇతర డిపోల్లో ఎక్కడా లేనివిధంగా మంచిర్యాల డిపో, గ్యారేజీ సెక్షన్​ ఆఫీసర్లు కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 
టైర్​ పేలినా డ్రైవర్​కే శిక్ష...
మంచిర్యాల డిపోకు చెందిన ఒక బస్సు మార్చి 21న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి మూలమలుపు దగ్గర ప్రమాదానికి గురైంది. బస్సు ముందు టైర్​ పేలిపోవడంతో డివైడర్​ పైనుంచి దూసుకెళ్లి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అందులో ఉన్న 36 మందిలో డ్రైవర్​, కండక్టర్​కు తీవ్ర గాయాలు, మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్​ హుస్సేన్​ను బాధ్యుడిని చేస్తూ గత నెల 22న సస్పెండ్​ చేశారు. బస్సు ముందు టైర్లు కొత్తవి వేయాల్సి ఉండగా, పాత టైర్లు వేయడంతో పగిలిందని డ్రైవర్​ చెప్తున్నాడు. కొత్త టైర్​ కూడా ఎయిర్​ వస్తే పగిలిపోతుందని, దానికి డ్రైవర్​ను సస్పెండ్​ చేయడం ఏమిటని కార్మికులు ఇటీవల డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఒకవేళ డ్రైవర్​ తప్పు ఉంటే యాక్సిడెంట్​ జరిగిన వారం రోజులకే మళ్లీ డ్యూటీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. యాక్సిడెంట్​పై ఆర్టీసీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడంతో పాత టైర్​ వేసినందుకు బాధ్యత వహించాల్సి వస్తుందనే భయంతో హుస్సేన్​ను మూడు నెలల తర్వాత సస్పెండ్​ చేశారని ఆరోపించారు.

ఫాస్టాగ్​ చార్జీలు డ్రైవర్లపైనే.. 
మంచిర్యాల నుంచి హైదరాబాద్​ వెళ్లే బస్సులకు టోల్​ ఫ్లాజాల దగ్గర ఫాస్టాగ్​ చార్జీలు డ్రైవర్లే భరించాలని గత నెల 23న డిపో మేనేజర్​ ఆర్డర్​ జారీ చేశారు. టోల్​ ఫ్లాజాల దగ్గర కార్డు ఉన్న రూట్లలో కాకుండా ఫాస్టాగ్​ రూట్లలో వెళ్లిన కారణంగా ఏప్రిల్​ నెలలో బస్సులపై పడిన రూ.73,153 సంబంధిత డ్రైవర్లే చెల్లించాలని, లేదంటే సాలరీలో రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఇతర వెహికల్స్​ మాదిరిగా బస్సులకు ఫాస్టాగ్​ ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదని డ్రైవర్లు చెప్తున్నారు.

లాక్​డౌన్​లో మస్టర్లు కట్​
లాక్​డౌన్​ టైంలో కార్మికులు, ఉద్యోగులందరికీ ఫుల్​ మస్టర్లు ఇవ్వాలన్న ఆర్టీసీ మేనేజ్​మెంట్​ ఆదేశాలను సైతం మంచిర్యాల డిపో ఆఫీసర్లు బేఖాతరు చేశారు. మే నెలలో తొమ్మిది మంది ఉద్యోగులకు వారం రోజులకు పైగా లీవ్​లు వేసి సాలరీ బిల్స్​ పంపించారు. జూన్​ నెలకు సంబంధించిన జీతాలు వస్తే ఎవరికి ఎంత రికవరీ చేశారో తెలుస్తుందని అంటున్నారు. మంచిర్యాల డిపో ఆఫీసర్ల వేధింపులు భరించలేకపోతున్నామని, ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి బాధ్యులపై యాక్షన్​ తీసుకోవాలని ఎంప్లాయీస్​ యూనియన్​ (ఈయూ) డిపో సెక్రటరీ గోలి శంకర్​ డిమాండ్​ చేశారు.