స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావహులకు రిజర్వేషన్ల షాక్

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావహులకు రిజర్వేషన్ల షాక్
  • సగం సీట్లు మహిళలకు కేటాయింపు
  • తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లు 
  • ఆశావహులకు రిజర్వేషన్ల షాక్​

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఇరు జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడంతో, దాని ప్రకారమే కొత్త రిజర్వేషన్లను ఖరారు చేశారు. అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు. 

 ఖమ్మం జిల్లాలో 20 మండలాలుండగా, ఎంపీపీ పదవుల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు నాలుగు, బీసీలకు 8, అన్​ రిజర్వుడ్ కేటగిరీలో మూడు మండలాలున్నాయి. ఇక జడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 3, బీసీలకు 8, అన్ రిజర్వుడ్ కేటగిరీలో నాలుగు మండలాలున్నాయి. ఇక ఎంపీపీ స్థానాల్లో 9 మహిళలకు కేటాయించగా, జడ్పీటీసీ స్థానాల్లో 10 మహిళలకు రిజర్వు చేశారు. ఎంపీటీసీ, సర్పంచ్​ లకు సంబంధించిన రిజర్వేషన్లను ఆయా మండలాల్లోనే లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు ఉండగా, 283 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎస్టీలకు 10 జడ్పీటీసీలు, 20 ఎంపీపీలు, ఎస్సీలకు  ఒక జడ్పీటీసీ, ఎంపీపీ నిల్​, బీసీలకు ఏడు జడ్పీటీసీ, ఒక ఎంపీపీ, నాలుగు జనరల్​(అన్​ రిజర్వ్​డ్​) జడ్పీటీసీలు, ఒక ఎంపీపీ గా ఉన్నాయి. 

తారుమారైన తలరాతలు..

భద్రాద్రికొత్తగూడెం  జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గతంలో జడ్పీటీసీ జనరల్​ మహిళగా ఉంది. ఇప్పుడు ఎస్టీ జనరల్​గా మారింది. దీంతో ఈ సారి పోటీ చేయాలనుకున్న ఓసీలు, బీసీలు,ఎస్సీ ఆశావహులు నిరాశకు గురయ్యారు. ఎస్టీల స్థానంలో బీసీలు, జనరల్​ స్థానంలో ఎస్టీలు ఇలా చాలా వరకు గతం కంటే ప్రస్తుత రిజర్వేషన్లు మారడంతో ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. మణుగూరు జడ్పీటీసీ గతంలో జనరల్​ గా ఉంది. ఎస్టీ మహిళగా మారింది. దమ్మపేట గతంలో జనరల్​గా ఉండగా అది ఇప్పుడు ఎస్టీ మహిళగా మారింది. పాల్వంచ జనరల్​గా ఉండగా ఇప్పుడేమో ఎస్టీ మహిళగా మరింది.

 పినపాక జనరల్​ మహిళగా ఉండగా ఇప్పుడు ఎస్టీ జనరల్​గా మారింది. బూర్గంపహాడ్​ గతంలో జనరల్​ మహిళ ఉంది. ఇప్పుడే జనరల్​గా మారింది.  ఇక ఎంపీపీల్లోనూ అదే పరిస్థితి ఉంది. అశ్వాపురం గతంలో జనరల్ మహిళగా  ఉండగా, ప్రస్తుతం ఎస్టీ జనరల్​గా మారింది. అశ్వారావుపేట గతంలో జనరల్​గా ఉండగా ఇప్పుడేమో ఎస్టీ మహిళగా మారింది.  బూర్గంపహాడ్​ గతంలో ఎస్సీ మహిళగా ఉండగా, ప్రస్తుతం బీసీ జనరల్​ గా మారింది. దమ్మపేట గతంలో ఎస్టీ జనరల్​గా ఉండగా ప్రస్తుతం జనరల్​గా మారింది. 

ఎంపీటీసీల రిజర్వేషన్లు ఇలా..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 22 మండలాల గాను మొత్తం 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 14 ఎంపీటీసీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. 2003 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 163 రిజర్వ్ చేశారు. ఇందులో 56 మహిళలకు ఎస్సీలకు 5 రిజర్వ్ చేయగా, అందులో రెండు మహిళలకు కేటాయించారు. 

 బీసీలకు 18 ఎంపీటీసీ స్థానాలు రిజర్వ్ చేయగా, అందులో ఎనిమిది మహిళల కేటాయించారు. జనరల్ కేటగిరీలో 87 ఎంపీటీసీ స్థానాలను రిజర్వ్ చేయగా 38 మహిళలకు కేటాయించారు.