మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని ఇందారం, శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ల విస్తరణకు అవసరమైన భూసేకరణకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. రెండు ఓసీపీలకు కలిపి జైపూర్ మండలంలో 600 ఎకరాలకు పైగా భూములను సేకరించనున్నారు. ఇందారం ఓసీపీ పరిధిలో ఇందారంలో 15 ఎకరాలు, టేకుమట్లలో 348, రామారావుపేటలో 129 ఎకరాలు, శ్రీరాంపూర్ ఓసీపీ పరిధిలో రామారావుపేట, దుబ్బపల్లి శివార్లలో 124 ఎకరాలను సేకరించనున్నారు. అయితే భూయజమానులకు పరిహారం చెల్లింపు విషయంలో అయోమయం నెలకొంది. ప్రభుత్వం జనరల్ అవార్డు ద్వారా భూములను సేకరించాలని స్పష్టం చేసింది. కానీ ఆఫీసర్లు కాన్సెంట్అవార్డుకు మొగ్గు చూపుతూ సీఎంవో పర్మిషన్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
జనరల్, కాన్సెంట్ అవార్డులంటే..
జనరల్ అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం 2013లో రూపొందించిన భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరిస్తారు. ఏదైనా ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి అంతకుముందు మూడేండ్లలో క్రయవిక్రయాలు జరిగిన భూముల రిజిస్ట్రేషన్ వాల్యూను పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారాన్ని నిర్ణయిస్తారు. కాన్సెంట్అవార్డు ప్రకారం మార్కెట్ రేటుకు అనుగుణంగా భూముల ధరలను పెంచి పరిహారాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇటీవల జనరల్ అవార్డు ద్వారానే భూసేకరణ చేయాలని, కాన్సెంట్అవార్డు జోలికి పోవద్దని స్పష్టం చేసింది. జనరల్ అవార్డుతో భూ యజమానులకు నష్ట పరిహారం తక్కువగా వస్తుందని కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, తద్వారా భూసేకరణ ఆలస్యం కానుందని భావిస్తున్న అధికారులు కాన్సెంట్అవార్డు కోసం ప్రభుత్వ అనుమతి పొందేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో కాన్సెంట్ అవార్డుతోనే..
ఇందారం, శ్రీరాంపూర్ ఓసీపీలకు గతంలో కాన్సెంట్అవార్డుతోనే రెండు వేల ఎకరాలకు పైగా సేకరించారు. ఇందారం ఓసీపీ కోసం నాలుగేండ్ల కిందట ఫస్ట్ఫేజ్లో ఇందారం, టేకుమట్ల, శెట్పల్లి, బెజ్జాల, రామారావుపేట, కాచనపల్లి గ్రామాల్లో 1,031.36 ఎకరాలను సేకరించారు. కాచనపల్లిలో మొదట ఎకరానికి రూ.10.50 లక్షల పరిహారం నిర్ణయించారు. గ్రామస్తులు ఆందోళన చేయడంతో రూ.2.10 లక్షలు పెంచి రూ.12.60 లక్షలు చేశారు. దీనిని సాకుగా చూపుతూ ఇందారం, టేకుమట్ల, శెట్పల్లి, బెజ్జాల గ్రామాల పరిధిలోని భూములకు పరిహారం పెంచేలా అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. దీంతో ఇందారం మినహా ఇతర గ్రామాల్లోని భూములకు రూ.12.6 లక్షల నుంచి రూ.16.6 లక్షలకు, ఇందారం పరిధిలో రూ.22.5 లక్షల నుంచి రూ.24.6 లక్షలకు పెంచారు.
బినామీ రిజిస్ట్రేషన్లతో పెరుగుతున్న విలువ
గతంలో ఇందారం ఓసీపీకి క్లియరెన్స్ రానుందనే విషయాన్ని ముందుగానే తెలుసుకున్న కొందరు నాయకులు బినామీ పేర్లపై గ్రామాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపారు. దీంతో కాచనపల్లిలో రిజిస్ట్రేషన్ వాల్యూ రూ. 6.5 లక్షలు, ఇందారంలో రూ.14.5 లక్షలు, టేకుమట్లలో రూ.8.5 లక్షలు వచ్చింది. అప్పటి మార్కెట్రేట్ల కన్నా రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువగా ఉందని, రైతులకు నష్టమని లీడర్లు, దళారులు అధికారులతో కుమ్మక్కై పరిహారాన్ని భారీగా పెంచారు. ఇప్పుడు సైతం ఇదే రీతిలో బినామీ పేర్లపై రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కాన్సెంట్అవార్డుకు అనుమతి ఇవ్వకపోతే జనరల్అవార్డు ద్వారా భూములు సేకరించినా భారీగా పరిహారం చెల్లించేలా కొందరు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
