ప్రజావాణి వినేదెన్నడో?

ప్రజావాణి వినేదెన్నడో?
  • సమస్యలపై బల్దియాకు వస్తున్న జనాలు 
  • అధికారులను కలిసేందుకు నో పర్మిషన్ 
  • కరోనా కారణంగా బంద్ పెట్టిన సర్కారు 
  • తిరిగి అన్ని కలెక్టరేట్లలో ప్రోగ్రామ్ షురూ 
  • ఏర్పాటు చేయకుండా బల్దియా నిర్లక్ష్యం
  • ట్విట్టర్, ఆన్ లైన్ లోనే వేలల్లో ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: సిటీవాసులు ఎదుర్కొనే సమస్యలపై చెప్పుకుందాంటే బల్దియా ప్రజావాణిని ప్రారంభించడంలేదు. తమ సమస్యలపై సంబంధిత అధికారులనైనా కలిసి చెప్పుకుందామని ప్రజలు వస్తుండగా లోపలికి కూడా అనుమతించడంలేదు. మూడేళ్లుగా ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు, భూములతో పాటు ఇతర  సమస్యలపై ఎంతో మంది బల్దియాకు వచ్చి వెనుదిరిగి పోతున్న పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా 2020 మార్చి, 17న  బంద్ పెట్టారు. 

కలెక్టరేట్లలో తిరిగి ప్రారంభించినా కూడా బల్దియా మాత్రం నిర్వహించడంలేదు.  కరోనాకు ముందు ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులపై తీసుకుని సంబంధిత శాఖల అధికారులు వాటిని విచారించి పరిష్కరించేవారు. ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటే తక్షణమే న్యాయం చేసేవారు. కరోనాకి ముందు డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో ప్రతి వారం 30 వరకు, జోనల్​స్థాయిలో 50 వరకు, హెడ్డాఫీసులో నిర్వహించే ప్రజావాణికి 100 వరకు ఫిర్యాదులు వచ్చేవి. 

ఇలా గ్రేటర్​లో  వెయ్యికిపైగా ఫిర్యాదులు అందేవి. ప్రతివారం వందలాది మంది సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించేది. ప్రజావాణిని ప్రారంభించేందుకు అధికారులు మాత్రం ఇంట్రెస్ట్​చూపడం లేదు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఆన్ లైన్​ లో పంపించాలని అధికారులు సలహాలు ఇస్తున్నారు. హెల్ప్​లైన్​ నంబర్, మై జీహెచ్ఎంసీ యాప్​, ట్విట్టర్, డయల్​100 కి  ఫిర్యాదులు చేసినా కొన్నింటికే పరిష్కారం లభిస్తుంది. 

ఇంట్రెస్ట్ చూపని అధికారులు

ప్రజావాణి నిర్వహించాలనే దానిపైనా అధికారులు ఆలోచన కూడా చేయడంలేదు. ప్రజలకు సేవలు అందించాల్సినా కూడా పట్టించుకోవడంలేదు. మేడ్చల్​జిల్లాలో గతేడాది నుంచి  ప్రజావాణి కొనసాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లలోనూ ప్రోగ్రాం తిరిగి ప్రారంభమైంది. బల్దియా అధికారులు మాత్రం ఏర్పాటుకు ఇంట్రెస్ట్​ చూపడంలేదు.   ప్రజావాణి నిర్వహిస్తే సమస్యలు పరిష్కారమైతాయని కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజావాణి నిర్వహించాలని జనాలు కోరుతుండగా.. అధికారులేమో పని తప్పించుకోడానికే ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుందిజీహెచ్ఎంసీ ఆఫీసుల్లో  ప్రజావాణి తిరిగి ప్రారంభిస్తే ప్రజలకు చాలా మేలు జరగనుంది. 

కార్యక్రమాన్ని నిర్వహించాలని జనాలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటే.. దీంతో ఎంత మేలుందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా పనిపై బల్దియా అధికారులను కలిసేందుకు వస్తే.. ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఉండరో తెలియని పరిస్థితి. అదే ప్రజావాణి నిర్వహిస్తే కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు తప్పనిసరి హాజరవుతారు. గతంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి సమయంలో ప్రతివారం వందలాది సమస్యలకు వెంటనే పరిష్కారం లభించేంది. దీంతోనే ప్రజావాణికి ఆదరణ పెరిగింది. కరోనా పోయినా తిరిగి ఏర్పాటు చేయకపోతుండగా ప్రజలు ఆఫీసుకు వచ్చి తిరిగి వెళ్లిపోతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.